కూటమి ప్రభుత్వంలో రెండు రెడ్‌బుక్‌లు.. ఒకటి లోకేష్.. రెండోది...?
రెడ్ బుక్‌ను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలను.. ఆ పార్టీ సానుభూతి పరులను రకరకాలుగా వేధిస్తున్నారని వైసీపీ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు.
రెడ్ బుక్ అనే పేరు ఏపీలో పొలిటికల్‌గా మంచి హీట్ పెంచుతోంది. వైసీపీ నేతలు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో అమలు చేస్తున్నారని.. రెడ్ బుక్ పాలనే ఏపీలో నడుస్తోందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రెడ్ బుక్‌ను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలను.. ఆ పార్టీ సానుభూతి పరులను రకరకాలుగా వేధిస్తున్నారని వైసీపీ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా మాజీ వైసీపీ నేత.. సినీనటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు అయ్యారు. దీంతో మరోసారి రెడ్‌బుక్ రాజ్యాంగం మీద వైసిపి తీవ్ర ఆరోపణలు చేస్తుంది. వైసీపీ నేతలు అందరూ రెడ్‌బుక్ రాజ్యాంగంతోనే ఆంధ్రప్రదేశ్లో పాలన నడుస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ రెడ్‌బుక్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత. తాజాగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రెడ్‌బుక్ పాలన నడుస్తుందని... ఈ అక్రమ అరెస్టులు ప్రతి ఒక్కరు ఖండించాలంటూ మండిపడ్డారు. ఎవరిని పడితే వారిని అరెస్టు చేసుకుంటూ పోతున్నారని వాసుపల్లి విమర్శించారు.
రెడ్‌బుక్ ఒకటి కాదు రెండు అని... వాసుపల్లి కొత్త విషయం బయటపెట్టారు. ఒక రెడ్బుక్ మంత్రి నారా లోకేష్ దగ్గర ఉంటే.. అందులో ఉన్న పేర్లు ప్రకారం ఆయన అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. ఇక రెండవ రెడ్‌బుక్ ఎవరి దగ్గర ఉందో కూడా వాసుపల్లి చెప్పారు. జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర రెండో రెడ్ బుక్ ఉందని అందులోకి కూడా తమకు గిట్టని వైసిపి నేతల పేర్లు రాసుకున్నారని.. అందుకే పాసాని కృష్ణమురళి లాంటి వారి అరెస్టులు జరుగుతున్నాయని వాసుపల్లి ఆరోపించారు.
ఇప్పటిదాకా ఏపీలో ఒకటే రెడ్ బుక్ ఉందని.. అది నారా లోకేష్ దగ్గర ఉందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.. కానీ ఇప్పుడు రెండవ రెడ్ బుక్ ఉందని వాసుపల్లి సంచలన విషయాన్ని బయట పెట్టారు. వైసీపీ నేతల అన్ని అరెస్టులు వెనక లోకేష్ మాత్రమే లేరని.. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యక్తులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.