వాజ్ పేయ్ అద్వానీ నాటి బీజేపీ కాదా ?
వాజ్ పేయ్ అద్వానీ నేల మీద పడుక్కుని పుస్తకాలనే తలగడలుగా మార్చుకుని నాటి జన సంఘ్ నుంచి నేటి బీజేపీ వరకూ ఒక్కో మెట్టూ ఎక్కించారు.
అవును. వాజ్ పేయ్ అద్వానీ బీజేపీ ఇది కాదు అని ఆ పార్టీని పూర్వం నుంచి అభిమానిస్తున్న వారు అనుకుంటున్న మాట. వాజ్ పేయ్ అద్వానీ నేల మీద పడుక్కుని పుస్తకాలనే తలగడలుగా మార్చుకుని నాటి జన సంఘ్ నుంచి నేటి బీజేపీ వరకూ ఒక్కో మెట్టూ ఎక్కించారు. వారు అవినీతికి ఆమడ దూరంగా ఉండేవారు. అలాగే తాము ప్రవచించిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు.
వాజ్ పేయ్ గురించి ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. 1999లో వాజ్ పేయ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు పెట్టాయి. అయితే ఒకే ఒక్క ఓటుతో వాజ్ పేయ్ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. ఆనాడు ఎంతో మంది వాజ్ పేయ్ ని కలసి ఆ ఒక్క ఓటు ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందామని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. అంతా పద్ధతి ప్రకారం సాగాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు. అలాగే ఓటమిని చిరునవ్వుతో స్వీకరించారు.
దాని ఫలితంగా 1999 ఎన్నికల్లో జనాలు వాజ్ పేయి ని గుండెలలో పెట్టుకున్నారు. ఎన్డీయేని పూర్తి మెజారిటీతో గెలిపించారు. ఇదీ ఆయన నిబద్ధత. మరి ఆయన వారసులుగా బీజేపీని దేశాన్ని ఏలుతున్న వర్తమాన నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షాలు అదే తీరున ప్రయాణిస్తున్నారా అంటే జనాలకు డౌట్లే వస్తున్నాయి. బీజేపీ అధినేతలు వారు. జాతీయ పార్టీకి నేతలు. దేశమంతా ఒక్కటిగా ఒకే మాట చెప్పాల్సిన వారు. తాము చెప్పిన మాటలకు కట్టుబడాల్సిన వారు.
ఇదంతా ఎందుకు అంటే 2019లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోడీ దారుణంగా విమర్శించారు. పోలవరం డబ్బుని ఏటీఎం గా వాడుకుంటున్నారు అని చంద్రబాబు మీద నేరుగా విమర్శలు చేశారు. వాటిని జవాబు లేదు. జనాలకు వివరణ లేదు, 2024 నాటికి రెండు పార్టీలు చేతులు కలిపి జనం ముందుకు వచ్చాయి. బాబు విషయంలో మోడీ ఆనాడు అన్న మాటలు తప్పు అనుకోవాలా లేక ఓట్ల కోసం రాజకీయం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తామని జనాలకు సందేశం ఇస్తున్నారా అన్నది ఒక డౌట్.
ఇదే విధంగా చూస్తే బీహార్ వెళ్ళినా తెలంగాణాకు వెళ్ళినా తమిళనాడుకు వెళ్ళినా మోడీ అమిత్ షా చెప్పే మరో మాట వారసత్వ రాజకీయాలు అని. రాజకీయాలు ఒకే కుటుంబానికి పరిమితం అవుతున్నాయని చెబుతూ వస్తున్నారు. మరి ఏపీలో చూస్తే చంద్రబాబు లోకేష్ ల తోనే టీడీపీ రాజకీయం సాగుతోంది. రాజమండ్రి సభలో లోకేష్ ని ఆప్యాయంగా మోడీ పలకరించారు.
ఒకనాడు వారసత్వ రాజకీయాలు అని విమర్శించి ఇపుడు వారితోనే జట్టుకడితే బీజేపీ మూల సిద్ధాంతాలు ఎక్కడికి పోతున్నాయని జనాలు అంటున్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం బీజేపీ ఎక్కడ పడితే అక్కడ రాజీపడితే మరి సిద్ధాంత బలం కలిగిన పార్టీ తేడా పార్టీ అని బీజేపీని ఎందుకు చెప్పుకోవాలని కూడా అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ తిట్టిన పార్టీలతోనే జట్టు కట్టడం. ఏమిటో ఈ రాజకీయం అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నా అధికారమే పరమావధిగా బీజేపీ విధానం ఉంటోందని విమర్శలు ఉన్నాయి. బీజేపీతో కలసి ఉంటే మంచివారు లేకపోతే చెడ్డవారు అన్నట్లుగా ఉంది.
ఏపీలో అవినీతి జరిగింది అని విమర్శిస్తున్న బీజేపీ పెద్దలు నాడు టీడీపీ ప్రభుత్వం మీద కానీ నేడు వైసీపీ ప్రభుత్వం మీద కానీ ఎందుకు విచారణలకు ఆదేశించలేకపోయారు అన్న సగటు ప్రజానీకం వేసే ప్రశ్నలకు జవాబు ఉందా అంటున్నారు. అంటే కేవలం రాజకీయ విమర్శలు చేస్తూ అవసరార్ధం ఆయా పార్టీల మద్దతు తీసుకుంటూ బీజేపీ కూడా అన్ని పార్టీల మాదిరిగా ఆ తానులో ముక్క అని చెప్పదలచారా అన్న చర్చ వస్తోంది.
రాజకీయాల్లో చూస్తే కనుక వాజ్ పేయ్ ని అంతా రాజనీతిజ్ఞుడు అని ఎందుకు అంటారో ఇపుడు అందరికీ అర్ధం అవుతోంది. ఆయన రాజకీయం కుల మత ప్రాంతాలకు అతీతం. అంతా మెచ్చేదిగా ఉంటుంది. ఆయన పార్టీ సిద్ధాంతాలను పాటించడంలో ఎపుడూ రాజీ పడలేదు. వాజ్ పేయ్ ఏళ్ళ తరబడి విపక్షంలో ఉండడాన్ని చూసిన నాటి కాంగ్రెస్ నేతలు మీరు మా పార్టీలోకి వస్తే ఏనాడో ప్రధాని అయ్యేవారు అని చెప్పేవారు. దానికి ఆయన చిరునవ్వు నవ్వి నా నిబద్ధతను పోగోట్టుకోను అని చెప్పేవారు.
మరి అలాంటి నాయకుడు వాజ్ పేయ్ సంస్థాపించిన బీజేపీయేనా ఈనాడు కొనసాగుతోంది అన్నది మాత్రం సగటు బీజేపీ అభిమానులకు ఉన్న సందేహాలు. అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే చాలా అంశాలకు పరిష్కారం ఉంటుందని ఆశపడిన వారికి పూర్తి మెజారిటీతో పదేళ్ళు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపుగా నిరాశ పరచింది అనే అంటున్నారు. అధికారంలోకి కొనసాగడానికే రాజకీయం అంటే మరి సిద్ధాంతాలు ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు కాషాయ దళం ఇవ్వగలదా అని అంటున్నారు.