వల్లభనేని వంశీని అడ్డంగా బుక్ చేసిన సీసీ కెమేరాలు?
ఏదో చేయాలనుకుంటే మరేదో అయినట్లుగా మారింది వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు చూస్తుంటే.
ఏదో చేయాలనుకుంటే మరేదో అయినట్లుగా మారింది వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు చూస్తుంటే. తన మీద ఉన్న కేసు నుంచి తప్పించుకోవటానికి ఆయన చేసిన ప్రయత్నం బెడిసి కొట్టటమే కాదు.. అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. ముందున్న కేసుకు మించి తీవ్రమైన కేసులో ఏ1గా మారిన దుస్థితి. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఒక నిందితుడిగా.. భారీ జాబితాలో అట్టడుగులో ఉన్నారు. ఆ కేసు నమోదుకు కారణం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే సత్యవర్ధన్.
ఆ కేసు నుంచి తప్పించుకోవటం కోసం ఈ మధ్యన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి.. దాడికి పాల్పడి.. తీవ్రంగా భయపెట్టి మరీ తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు రావటం.. అధికార పార్టీ అలెర్టు అయ్యింది. తాము పవర్ లో ఉండి కూడా.. తమ పార్టీ ఆఫీసులో పని చేసే ఉద్యోగిని కిడ్నాప్ చేయటం ఏమిటి? దాడులకు పాల్పడటం ఏమిటి? అధికారంలో లేనప్పుడు ఇచ్చిన ఫిర్యాదును ఇప్పుడు వెనక్కి తీసుకునేలా చేయటం ఏమిటి? అన్న అంశాల మీద సీరియస్ గా ఫోకస్ చేసి.. ఈ మొత్తం వ్యవహారంలో కర్త.. కర్మ.. క్రియ అంతా వల్లభనేని వంశీ అన్నట్లుగా తేల్చారు.
ఆ వెంటనే.. తాజా సెక్షన్లతో కొత్త కేసును కట్టి.. హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం రిమాండ్ ఉన్న వంశీ చేసిన నేరాలకు సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. తన తప్పు లేదని వంశీ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాధితుడు సత్యవర్ధన్ ను ప్రశ్నించిన పోలీసులు.. అతడ్ని ఎవరెవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడెక్కడకు తీసుకెళ్లారు? లాంటి వివరాల్ని సేకరించారు.
అతడిచ్చిన సమాచారం ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమేరా ఫుటేజ్ ను సేకరించగా.. అందులో సత్యవర్ధన్ కిడ్నాప్ కు సంబంధించిన ఆధారాలు పక్కగా దొరికినట్లుగా తెలుస్తోంది. అతడ్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తీసుకెళ్లటం.. అక్కడ వంశీ ఇంటికి తీసుకెళ్లటంతో పాటు.. ఆ తర్వాతి రోజు కారులో విశాఖకు తరలించటం.. అనంతరం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన ద్రశ్యాలు మొత్తం పోలీసుల చేతికి అందినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 12 మంది బాధ్యులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇప్పటికే ఐదుగురు అరెస్టు కాగా.. మిగిలిన వారి ఆచూకీ కోసం రెండు టీంలు గాలింపులు జరుపుతున్నారు. వీరిలో కీలక నిందితులుగా ఉన్న రంగా.. కోట్లు.. రాము దొరికితే కేసు కొలిక్కి వచ్చినట్లేనని చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ పుణ్యమా అని.. వల్లభనేని వంశీ అడ్డంగా బుక్ అయినట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.