వంశీపై థర్డ్ డిగ్రీ : టెన్షన్లో వైసీపీ!

దీంతో వంశీ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ క్షణక్షణం టెన్సన్ కు గురి చేస్తోందని అంటున్నారు.

Update: 2025-02-20 16:27 GMT

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో వైసీపీకి టెన్షన్ పెరిగిపోతోంది. వంశీపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కూటమి సర్కారుకు ప్రధాన టార్గెట్ అయిన వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో.. కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు వేసిన పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. వంశీని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని, ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని వంశీ తరఫు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వంశీ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ క్షణక్షణం టెన్సన్ కు గురి చేస్తోందని అంటున్నారు.

టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూనే రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. కిడ్నాప్ కేసుకు ముందు వంశీపై ప్రధానంగా రెండు కేసులు నమోదయ్యాయి. వంశీపై మొత్తంగా 16 కేసులు ఉన్నా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ను కులం పేరుతో దూషించిన కేసే అందరినీ అటెన్షన్ కు గురిచేసింది. అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వంశీ, అట్రాసిటీ కేసులో మాత్రం బెయిల్ తెచ్చుకోలేకపోయారు. ఈ లోగా బాధితుడు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో అరెస్టు అయ్యారు. అయితే ఆయనను కస్టడీకి అప్పగించాలని విజయవాడ పడమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆయన తరపు న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్ గా ప్రచారంలో ఉన్న వంశీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి సమయంలో ఆయన అక్కడ లేరని, ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ఎవరో తనకు తెలియదని చెబుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఆయనపై కేసు నమోదు చేయడం, కస్టడీకి ఇమ్మని కోరడంలో అర్థం లేదని పొన్నవోలు వాదిస్తున్నారు. తన వాదనలకు మద్దుతగా పలు తీర్పులను ఆయన కోర్టుకు నివేదించారు. అయితే ఇదే విషయమై కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన పొన్నవోలు.. వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసు కస్టడీకి అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటూ అంతా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి న్యాయ విచారణలో థర్డ్ డిగ్రీని ప్రభుత్వం చాలా కాలం క్రితమే నిషేధించింది. కానీ, గతంలో ఏపీలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల్లో కస్టోడియల్ టార్చర్ ఇప్పటికీ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరిస్తుందా? అనే అనుమానాలు, భయాలు ప్రతిపక్షాన్ని వెన్నాడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనంటూ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News