జైల్లో వంశీ ఒంటరిగా ఉన్నారు.. అసిస్టెంట్ ను ఇవ్వాలంటూ పిటిషన్!

ఒకటి కాదు రెండు కాదు తీవ్రమైన పలు ఆరోపణలతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయటం.. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండటం తెలిసిందే.

Update: 2025-02-18 05:13 GMT

ఒకటి కాదు రెండు కాదు తీవ్రమైన పలు ఆరోపణలతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేయటం.. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తన అరెస్టు అక్రమంగా జరిగిందని.. తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ వంశీ తరఫు లాయర్లు కోర్టుకు వాదనలు వినిపిస్తున్నారు. అంతేకాదు.. వంశీకి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. జైల్లో ఆయనకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

మిగిలిన వసతులు సంగతి ఎలా ఉన్నప్పటికి.. ఒక వినతి మాత్రం అందరిని ఆకర్షిస్తోంది. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న వంశీకి బోలెడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొన్న పిటిషన్ లో మరిన్ని అంశాల్ని ప్రస్తావించారు. కరోనా వేళ నుంచి వంశీకి బ్రీతింగ్ సమస్యలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. టెయిల్ బోన్ గాయంతో బాధ పడుతున్నారని.. ఈ కారణంగా నేల మీద కూర్చోవటం.. పడుకోవటానికి కష్టంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. అందుకే వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు.

బెయిల్ ఇచ్చే లోపు.. జైల్లో ఉన్న వంశీకి టాయిలెట్.. బెడ్.. ఇంటి నుంచి ఆహారం.. మందుల సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. అంతేకాదు.. జైలు బ్యారక్ లో ఒంటరిగా ఉన్న వంశీ.. మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లుగా బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే.. జైలు గదిలో వంశీకి అసిస్టెంట్ గా ఒకరిని ఏర్పాటు చేయాలని కోరటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాజా కేసులో వంశీని.. అతడి అనుచరుల నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని.. పది రోజులు తమ కస్డడీకి అప్పజెప్పాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మిగిలిన సౌకర్యాలు ఓకే అనుకున్నా.. జైల్లో ఒంటరిగా ఉండకుండా అసిస్టెంట్ సాయం కోరిన వైనం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News