వంశీకి కష్టాలు పొడిగింపు.. ఊరట ఎప్పుడు?
దీంతో ఈ నెల 25వ తేదీ వరకు వంశీ జైల్లోనే ఉండక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.;
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కష్టాలు మళ్లీ పెరిగాయి. ఆయనకు బెయిల్ రాకపోవ డంతో తాజాగా విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. దీంతో ఈ నెల 25వ తేదీ వరకు వంశీ జైల్లోనే ఉండక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. టీడీపీ యువ నాయకుడు, సత్యవర్థన్‌ను నిర్బంధించి, బెదిరించిన కేసులో వంశీ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో ఆరుగులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
వీరిలో ఇద్దరు మాత్రమే పోలీసులకు చిక్కారు. మిగిలిన నలుగురు తప్పించుకు తిరుగుతున్నారు. ఇక, ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, దీనిపై ఎలాంటి తీర్పు వెలువడ లేదు. మరోవైపు పోలీసులు తమ కస్టడీకి తీసుకుని ఇప్పటికే విచారించారు. అయినా.. కీలక విషయాలను రాబట్టలేకపోయారని ఉన్నతాధికారులు కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీంతో మరోసారి వంశీని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
దీంతో మరో 10 రోజుల పాటు వంశీని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విచారణ పెండింగులో ఉంది. ఇక, ఈ కేసు పూర్వాపరాలు ఇంకా పూర్తికానందున చార్జిషీటు ఇప్పట్లో దాఖలయ్యే అవకాశం లేదు. పైగా నిందితులు పరారీలో ఉన్నారు. వీరిని గుర్తించి పట్టుకుని విచారించి నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో.. ఈ నేపథ్యంలో వంశీకి ఇప్పట్లో ఉపశమనం లభించే అవకాశం లేదు. అయితే.. మరో నెలలోపు కోర్టు కనికరిస్తే.. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.