పోలీసుల ప్రశ్నలు.. ముందే సిద్ధం చేసుకున్న సమాధానాలు.. రెండో రోజుకు వంశీ కస్టడీ!

ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎందుకు దాడి చేయాల్సివచ్చిందనే ప్రశ్నకు వంశీ చెప్పిన సమాధానంతో పోలీసులు విస్తుపోయారంటున్నారు.

Update: 2025-02-26 06:30 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీని మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.. విజయవాడ క్రిష్ణలంక పోలీసుస్టేషన్ లో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులను ముగ్గురు డీసీపీలు వేర్వేరుగా విచారిస్తున్నారు. తొలిరోజు విచారణ సందర్భంగా వంశీని పోలీసులు 30 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అయితే ఎక్కువ ప్రశ్నలకు ఆయన తెలియదు.. గుర్తులేదు.. మరచిపోయాననే రొటీన్ డైలాగే చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా పోలీసులు ఏ ప్రశ్నలు అడుగుతారో ముందే ఊహించినట్లు సమాధానాలు కూడా సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.

ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎందుకు దాడి చేయాల్సివచ్చిందనే ప్రశ్నకు వంశీ చెప్పిన సమాధానంతో పోలీసులు విస్తుపోయారంటున్నారు. వంశీని జైలులో పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ చెప్పిన కారణాన్నే వంశీ పోలీసులకు చెప్పినట్లు చెబుతున్నారు. టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టినట్లు మాట్లాడటంతోనే తమ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో దాడి చేశాయని వంశీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో విచారణ సందర్భంగా తాము అడిగే ప్రశ్నలను ముందుగానే వంశీ ప్రిపేర్ అయినట్లు కనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు వంశీ పోలీసు కస్టడీని రద్దు చేయాల్సిందిగా ఆయన తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీ విచారణలో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి న్యాయవాదులతో మాట్లాడించాల్సివుండగా, పోలీసులు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు కస్టడీలో ఎక్కువ ప్రశ్నలకు వంశీ దాటవేసినట్లు ప్రచారం జరుగుతోంది. కిడ్నాప్ కేసులో బాధితుడు సత్యవర్థన్ ఎవరో తనకు తెలియదని, విజయవాడ నుంచి హైదరాబాద్ లోని అతడు తన ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాతే సత్యవర్థన్ అన్న విషయం తెలిసిందని వంశీ చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా సత్యవర్థన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మరునాడు వెళ్లిపోయాడని ఎక్కడికి వెళ్లింది తనకు తెలియదని వంశీ చెప్పారంటున్నారు.

సత్యవర్థన్ ను తాను బెదిరించలేదని, తనకు తానుగా విజయవాడలోని న్యాయాధికారి వద్దకు వచ్చి కేసు వాపసు తీసుకున్నాడని వంశీ తెలిపారంటున్నారు. సత్యవర్థన్ వెళ్లిన తర్వాత వంశీ హైదరాబాద్ నుంచి తాడేపల్లి ఎందుకు వచ్చారనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని పోలీసులు చెబుతున్నారు. తాడేపల్లి వచ్చిన విషయం నిజమే కానీ, తాను అక్కడ ఎవరినీ కలవలేదని వంశీ చెప్పారంటున్నారు. ఎవరినీ కలవకుండా తాడేపల్లి ఎందుకు రావాల్సివచ్చిందనే ప్రశ్నకు మౌనం దాల్చినట్లు చెబుతున్నారు.

ఇక వంశీ మొబైల్ ఫోన్లపై పోలీసులు ఆరా తీయగా, తాను ఎక్కడ పెట్టానో మరచిపోయినట్లు వంశీ చెప్పాడంటున్నారు. తన వద్ద మొత్తం మూడు ఫోన్లు ఉన్నాయని, కానీ, అవి ఎక్కడున్నాయో తనకు సరిగా గుర్తులేదని చెప్పారంటున్నారు. వంశీ అరెస్టు సందర్భంగా ఆయన ఫోన్ లొకేషన్ హైదరాబాద్ లోని హైహోం భూజా విల్లాస్ నే చూపినట్లు పోలీసులు చెప్పగా, ఆయన మౌనంగా ఉండిపోయారంటున్నారు.

వంశీ తెలియదన్నా, మౌనంగా ఉన్నా ఆయా ప్రశ్నలకు ఆధారాలను పోలీసులు చూపడంతో వంశీ షాక్ తిన్నాడని అంటున్నారు. మరోవైపు వంశీతోపాటు అరెస్టు చేసిన మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారు మాత్రం పోలీసులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తున్నారని చెబుతున్నారు. రెండో రోజు విచారణ అనంతరం.. ముగ్గురిని కలిపి ఒకేసారి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో వంశీ కస్టడీపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News