ఒక్క మాటతో తలకిందులైన జీవితం.. 15 ఏళ్ల రాజకీయం అంతం!
పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసినా, తాజాగా ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితిని ఎవరూ సమర్థించలేకపోతున్నారని అంటున్నారు.
వల్లభనేని వంశీ.. మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించి ఆ పార్టీపైనే తిరుగుబాటు చేసి.. పార్టీ అధినేత కుటుంబంపై నోరుజారి చిక్కుల్లో పడిన నాయకుడు. గన్నవరం నుంచి టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. అదే పార్టీకి టార్గెట్ అయ్యారు. దూకుడైన రాజకీయంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న వంశీ.. అదే దూకుడుతో ఇబ్బందులు కొనితెచ్చుకున్నారంటున్నారు.
పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసినా, తాజాగా ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితిని ఎవరూ సమర్థించలేకపోతున్నారని అంటున్నారు. ఆయన సొంత పార్టీ వైసీపీ కూడా వంశీ అరెస్టును ఖండిస్తున్నా, ఆయన గతంలో వ్యవహరించిన తీరును దాటవేస్తూ తప్పించుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సినీ నిర్మాతగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన వల్లభనేని వంశీ.. టీడీపీ సీనియర్ నేత పరిటాల రవీంద్ర అనుచరుడిగా ఆ పార్టీకి దగ్గరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసి ఆయనకు దగ్గరైన వంశీ.. టీడీపీలో ఓ స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో తొలిసారి టీడీపీ టికెట్ పై విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసిన వంశీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, 2014 ఎన్నికల్లో కేశినేని నానికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో వంశీకి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో సంబంధాలు, ఓడినా పార్టీ కోసం పనిచేయడం, దివంగత నేత పరిటాల రవీంద్ర అనుచరుడనే గుర్తింపు కలిసిరావడంతో వంశీకి టీడీపీకి మంచి పట్టున్న గన్నవరం టికెట్ దక్కింది. గన్నవరంలో ఇప్పటివరకు టీడీపీ ఓడిన చరిత్ర లేదు. రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచినా, ఆ ఇద్దరూ టీడీపీ నేతలే కావడం గమనార్హం.
అలాంటి సీటులో రెండు సార్లు పార్టీ అవకాశమిస్తే.. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వంశీ అప్పటి అధికార పార్టీ వైసీపీకి దగ్గరయ్యారు. 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రకు ఎదురెళ్లి ఆయనతో కరచాలనం చేసినా అప్పట్లో టీడీపీ పెద్దగా పట్టించుకోలేదు. వంశీపై నమ్మకంతో 2019లో టికెట్ ఇచ్చి గెలిపించారు.
టికెట్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా భారీ సాయం చేశారని కూడా ఆ పార్టీలో టాక్. అయితే ఎన్నికల్లో గెలిచాక వైసీపీకి దగ్గరైన వంశీ.. మిగిలిన ఎమ్మెల్యేల్లా కాకుండా.. పరిధి దాటి వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంతి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలకు దిగి ముప్పు తెచ్చుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో వంశీ నోరు జారడంతోనే చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం, కౌరవ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని, మళ్లీ గెలిచి సీఎంగా గౌరవ సభలోనే అడుగు పెడతానని ప్రతినబూనారు.
అలా వంశీ నోరు జారిన ఒక్క మాటే ఆయనకు ఆయన మద్దతు పలికిన పార్టీకి తీరని నష్టం చేసింది. 151 ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ.. ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత సాధించలేకపోయింది. ఇక వ్యక్తిగతంగా తాను ఎంతటి తప్పు చేశానో తెలుసుకున్న వంశీ నష్టనివారణ ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు.
అప్పటికే ఆయన మాటలు టీడీపీ క్యాడర్ ను తీవ్రంగా బాధించడంతో సంబంధం లేనివారు కూడా వైసీపీ పతనాన్ని కోరుకునేలా చేసిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన అరెస్టు తర్వాత క్రిష్ణలంక పోలీసు స్టేషన్ ఎదుట మాట్లాడిన వంశీ భార్య కూడా తప్పు అయిపోయిందనే భావాన్ని వ్యక్తం చేయడం.. తప్పు అంతా చేస్తారని, తమకు న్యాయం చేయాలని వేడుకోవడం చూస్తుంటే వంశీ మాటల ద్వారా ఎంత నష్టపోయాడనేది అర్థం అవుతోందనే విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు కుటుంబంపై మాట జారిన వంశీ గత 9 నెలలుగా అండర్ గ్రౌండులో దాక్కోవాల్సివచ్చిందని అంటున్నారు. ఆయనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా, ప్రభుత్వ పంతం వల్ల అనూహ్యంగా కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నారనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, అమెరికా వెళ్లి వ్యాపారాలు చేసుకుంటానని ప్రభుత్వానికి మధ్యవర్తుల ద్వారా సంప్రదించినా, అటు నుంచి క్షమించే పరిస్థితి లేకపోవడంతో వంశీ ఉక్కిరిబిక్కిరి అయ్యారంటున్నారు.
ఏ పార్టీ కోసం అయితే పనిచేశాడో.. అదే పార్టీ కార్యకర్తలుగా బద్ధ శత్రువుగా మారడం వంశీ విషయంలో చూస్తున్నామని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయాల్లో పరిధి దాటి వ్యవహరిస్తే ఎలాంటి ఫలితాలు అనుభవించాల్సివస్తుందో వంశీ కేసు ఓ కేస్ స్టడీగా నిలుస్తుందంటున్నారు. కేవలం అదుపు తప్పి నోరు జారిన ఒకే ఒక మాటే వంశీని ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎదుర్కొనేలా చేస్తుందనే అభిప్రాయం అంతా వ్యక్తం చేస్తున్నారు.