ఎంపీ విలన్.... ఆయన జాక్ పాట్ మంత్రి...జనసేన నేత!
తాను పార్టీ మారింది కూడా ఆయన వల్లనే అన్నారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ ఎంవీ వంశీని గెలవనీయను అని శపధం చేశారు
తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అని ఇటీవల వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన రాజకీయ జీవితానికి విలన్ ముమ్మాటికీ ఆయనే అని వంశీ స్పష్టంగా చెప్పేశారు.
తాను పార్టీ మారింది కూడా ఆయన వల్లనే అన్నారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ ఎంవీ వంశీని గెలవనీయను అని శపధం చేశారు. అంతే కాదు ఆయనను రాజకీయాల్లో ఉండనీయకుండా చేస్తాను అని మరో శపధం చేశారు. తాను వైసీపీకి మొదట్లో వచ్చాను అని వంశీ చెప్పారు. ఆనాడు తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను అని తరువాత వచ్చిన నాయకులు మాత్రం పార్టీలో కీలకమైన స్థానాలలో ఉన్నారని మంత్రులు కూడా అయ్యారని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక సీనియర్ గా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని ఆన చెప్పుకొచ్చారు. ఇక తాను 2019 ఎన్నికలకు ముందు ఎంపీ ఎంవీవీని జగన్ కి పరిచయం చేశాను అని అన్నారు. అలా ఆయన్ని రాజకీయాల్లోకి తాను తీసుకుని వస్తే చివరికి తనకే ఆయన ఎసరు పెట్టారు అని వాపోయారు.
ఎంవీవీని తెచ్చి విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించడంతో తన పాత్ర ఉందని అన్నారు. అయితే అదే ఎంవీవీ 2019 ఎన్నికల్లో చివరి నిముషంలో తనకు టికెట్ దక్కకుండా చేశారని ఎక్కడో భీమిలీలో ఉన్న వారిని తెచ్చి విశాఖ తూర్పులో టికెట్ ఇప్పించి అలా తన కెరీర్ ని నాశనం చేశారని అన్నారు. ఇక మేయర్ పదవి కూడా తనకు దక్కకుండా వైసీపీలోనే కుట్ర జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలో తొలి నుంచి ఉన్న తనకు కాకుండా గుడివాడ అమర్నాథ్ మంత్రి పదవిని తన్నుకుని పోయారని ఆయన జాక్ పాట్ మంత్రి అంటూ వంశీ హాట్ కామెంట్స్ చేశారు. తన మీద ఈ రోజు విమర్శలు చేస్తున్న వారు అంతా తాను వైసీపీలోకి తెచ్చిన వారే అని వంశీ అన్నారు.
తాను వైసీపీ కోసం ఎంతో పాటు పడ్డానని కానీ తననే పార్టీలో ఏమీ కాకుండా చేశారని వంశీ అనడం విశేషం. ఇక తాను 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎక్కడైనా పోటీ చేస్తాను గెలుస్తాను అని వంశీ ధీమా వ్యక్తం చేశారు. తాను సంక్రాంతి తరువాత తన సత్తా చాటుతాను అని అన్నారు.
వైసీపీలో ఉన్న వారిలో అనేక మంది ఇపుడు తనతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. అదే విధంగా విశాఖ కార్పోరేషన్ లో ముప్పయి మంది దాకా కార్పోరేటర్లు కూడా తనతో టచ్ లో ఉన్నారని వంశీ అంటున్నారు. వైసీపీని ఓడించడం కోసం తాను ఇక మీదట పనిచేస్తాను అని వంశీ ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయవద్దు అని జనసేన అధినాయకత్వం తనకు సూచించిందని, అందుకే రాజీనామా చేయడం లేదు అని వంశీ అంటున్నారు. మొత్తానికి వంశీ విశాఖ ఎంపీ మీద మండిపోతున్నారు. మంత్రి అమర్నాథ్ మీద నిప్పులు చెరుగుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.