ట్రోలర్లను క్షమించను.. వంశీ భార్య పంకజశ్రీ ఫైర్
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను అరెస్టు చేసిన తర్వాత తొలిసారిగా బయటకు వచ్చిన తనను ట్రోలర్లు టార్గెట్ చేయడంపై విచారం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను అరెస్టు చేసిన తర్వాత తొలిసారిగా బయటకు వచ్చిన తనను ట్రోలర్లు టార్గెట్ చేయడంపై విచారం వ్యక్తం చేశారు. ఒక పార్టీకి చెందిన మహిళలే మహిళలా అంటూ నిలదీశారు. ట్రోలర్లపై ప్రైవేటుగా కేసులు వేస్తానని హెచ్చరించారు.
సోషల్ మీడియా బాధితుల్లో వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ చేరిపోయారు. భర్త అరెస్టు తర్వాత విజయవాడలో ఉంటూ వంశీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ఆమెను ట్రోలింగ్ చేయడాన్ని తట్టుకోలేకపోయారు. మంగళవారం వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ రాగా, పంకజశ్రీ కూడా ఆమె వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పంకజశ్రీ సోషల్ మీడియా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్రోలింగ్ చేయడం సరికాదన్నారు. ట్రోలింగులకు ఫుల్ స్టాప్ పెట్టకపోతో తాను న్యాయపోరాటం చేస్తానని, ప్రైవేటు కేసులు వేస్తానని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని చెప్పారు. ఒక పార్టీకి చెందిన వారికి మాత్రమే రక్షణ ఉంటుందా? వేరే పార్టీకి చెందిన వారికి సోషల్ మీడియా నుంచి రక్షణ ఉండదా? అంటూ పంకజశ్రీ నిలదీశారు. ఇటీవల ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు జరిగిన విషయం తెలిసిందే. ఒక పార్టీకి చెందిన వారు మరోపార్టీ వారిని హేయమైన భాషలో ట్రోల్ చేయడం, ఫొటోలు మార్ఫింగ్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని అసభ్యకరమైన పోస్టులపై ఉక్కుపాదం మోపింది. అయితే తమ పార్టీకి చెందిన వారినే అరెస్టు చేస్తున్నారని, తమపై ట్రోలింగ్ చేస్తున్నవారిని వదిలేస్తున్నారని వైసీపీ చాలాకాలంగా ఆరోపిస్తోంది. తాజాగా వంశీ సతీమణి పంకజశ్రీ కూడా అవే తరహా విమర్శలు చేయడంతో మరోమారు సోషల్ మీడియాపై చర్చ మొదలైంది. తనను ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టు అంటూ పంకజశ్రీ ప్రశ్నలకు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సివుంది.