వనమాడి బ్రదర్స్ ఇంట్లో వారసత్వం చిచ్చు

కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు ఆయన సొంత అన్న సత్యనారాయణల మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంటోందని అంటున్నారు.

Update: 2025-02-12 03:52 GMT
కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు ఆయన సొంత అన్న సత్యనారాయణల మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంటోందని అంటున్నారు. దానికి కారణం వారసులు రెండు కుటుంబాల నుంచి రెడీ అవడమే. 2014లో కొండబాబు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయనను గెలిపించడం వెనక అన్న సత్యనారాయణ పాత్ర ఉందని అంటారు.

క్యాడర్ తో కూడా నేరుగా పరిచయాలు కానీ రాజకీయ వ్యూహాలు కానీ సత్యనారాయణ చూసుకునే వారు అని అంటున్నారు. సొంత తమ్ముడే ఎమ్మెల్యే కానీ అన్న సత్యనారాయణ అంతా తానే అయి నడిపించేవారు అని చెబుతారు. ఇక 2019లో వైసీపీ ఇక్కడ నుంచి గెలిచింది. దాంతో ఆ అయిదేళ్ళ పాటు కూడా తమ్ముడికి వెన్నుదన్నుగా అన్న సత్యనారాయణ ఉండేవారు అని చెబుతారు.

అయితే 2024 ఎన్నికల వేళ మాత్రం తమ్ముడికి బదులుగా తనకు టికెట్ ఇవ్వాలని సత్యనారాయణ అధినాయకత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అక్కడే వనమాడి బ్రదర్స్ లో తొలి చిచ్చు రేగింది. తనకు ఒకవేళ ఇవ్వకపోత తన కోడలుకు అయినా ఇవ్వాలని ఆయన కోరారు. అయితే ఈ ఎత్తులు పై ఎత్తు అన్నట్లుగా కొండబాబు తనకు ఇదే ఆఖరు ఎన్నిక అని చెబుతూ అధినాయకత్వం వద్ద టికెట్ సాధించారు అని చెబుతారు.

మొత్తానికి టీడీపీ ఊపుతో కొండబాబు గెలిచారు. అదే సమయంలో సత్యనారాయణ కుటుంబం కూడా 2029లో బెటర్ లక్ అని సర్దుకుంది. కానీ తీరా ఇపుడు చూస్తే కొండబాబు కొడుకు మోహనవర్మ రంగంలోకి దిగారని అంటున్నారు. ఆయన తన తండ్రి తరఫున అన్నీ చక్కబెడుతూ ఎమ్మెల్యే పనులు చేయిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తానే పోటీకి రెడీ అన్న సంకేతాలను మోహన వర్మ ఇవ్వడంతో సత్యనా రాయణ ఆయన కుమారుడు ఉమాశంకర్ గరం గరం అవుతున్నారుట. మాట ప్రకారం కొండబాబుకు ఇవే ఆఖరు ఎన్నికలు అని ఆ తరువాత ఉమాశంకర్ కే టికెట్ అని సత్యనారాయణ వర్గం అంటోంది. కానీ అలాంటిది ఏదీ లేదని తన తండ్రి కి తానే వారసుడిని అని మోహన వర్మ అంటున్నారుట.

దాంతో విషయం అర్ధం కాక క్యాడర్ బుర్రలు పట్టుకుంటోంది. ఎవరికి జై కొట్టాలో ఎవరిని పక్కన పెట్టాలో తెలియడం లేదు అని అంటున్నారు. అన్న దమ్ములు ఇద్దరూ ఒక్కటిగా ఉన్నపుడు పార్టీ క్యాడర్ అంతా కలసి పనిచేసింది. ఇపుడు వనమాడి బ్రదర్స్ మధ్య రాజకీయం రాజుకున్న వేళ ఎటు వెళ్తే ఏమవుతుందో అన్న చర్చ సాగుతోంది.

మరో వైపు చూస్తే కొండబాబుకు ఆరు సార్లు ఎమ్మెల్యే టికెట్ పార్టీ ఇచ్చిందని వచ్చేసారికి అయినా తమ కుటుంబానికి దక్కరాదా అని సత్యనారాయణ నేరుగా క్యాడర్ తోనే చెబుతున్నరాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇదే విషయం మీద కొండబాబు అయితే తన కుమారుడు మోహన వర్మ రాజకీయ ఆకాంక్షలు తనకు తెలియవు అన్నట్లుగా చెబుతున్నారట. అయితే లోపాయికారీగా మాత్రం తన వారసుడు కుమారుడే అని హింట్ ఇస్తూ మద్దతు కూడా అంతర్గతంగా ఇస్తున్నారుట.

దీంతో రెండు వర్గాలుగా వనమాడి బ్రదర్స్ రాజకీయం చీలింది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడే టీడీపీ నుంచి పోటీ చేస్తాడని ఎంతకాలం పల్లకీ మోస్తామని సత్యనారాయణ అంటునారుట. మరి ఈ వివాదం ఎంతదాకా వెళ్తుందో అధినాయకత్వం ఎవరికి మద్దతు ఇస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి చూస్తే కొండబాబు ఎమ్మెల్యే కాబట్టి ఆయన వైపే హైకమాండ్ ఉంది ఆయన హవానే సాగుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News