కాబోయే మంత్రి వంగవీటి ?

వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ కోసం మంత్రి పదవి వేచి ఉందా. రాధా దశ తిరుగుతోందా.

Update: 2024-10-23 03:37 GMT

వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ కోసం మంత్రి పదవి వేచి ఉందా. రాధా దశ తిరుగుతోందా. రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత రాధాకు తగిన స్థానం లభిస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయిట.

వంగవీటి రంగా వారసుడిగా రాధాకృష్ణ ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం అంటే 2004లో కాంగ్రెస్ లో చేరి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. ఆ తరువాత ఆయన ప్రజారాజ్యంలో చేరి 2009లో పోటీ చేసినా వైసీపీలో చేరి 2014లో బరిలోకి దిగినా మళ్ళీ గెలవలేకపోయారు. టీడీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చిన రాధాకు అపుడూ 2024లోనూ కూడా టికెట్ దక్కలేదు.

అయితే ఆయనకు నామినేటెడ్ పదవిని ప్రామిస్ గా ఇచ్చారు. ఆ మేరకు టీడీపీ అధినాయకత్వం నుంచే నేరుగా భరోసా దక్కింది. ఇక 2024 ఎన్నికల వేళ రాధా ఏపీలో అంతా పెద్ద ఎత్తున పర్యటించి వైసీపీకి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఆయన తనదైన శైలిలో ఒక బలమైన సామాజిక వర్గం మద్దతుని టీడీపీకి కూడగట్టారు.

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి అయిదవ నెల ప్రవేశించింది. రాధాకు పదవి అయితే దక్కలేదు. ఆయన అభిమానులు అయితే ఎంతో ఆశగా చూస్తున్నారు. ఇంతలో రాధాకు గత నెలలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా రాధా ఇంటికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి అయిన నారా లోకేష్ వెళ్లారు. ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రాధాకు ఆయన పార్టీ తరఫున ఒక కీలక హామీని ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు ఎమ్మెల్యే కోటాలో ఒక సీటుని కేటాయిస్తామని స్పష్టం చేశారని ప్రచారం సాగుతోంది.

ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే బలమైన సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దాంతో పాటు ఏపీ కేబినెట్ లో ఒక పదవిని అలాగే ఖాళీగా ఉంచేశారు. దాంతో రాధాని ఎమ్మెల్సీగా చేసి ఆ పదవిని ఆయనకు కట్టబెడతారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే రాధా పంట పండినట్లే అని అంటున్నారు.

రంగా వారసుడిగా రాధా రానున్న కాలంలో మరింతగా దూకుడు చేయడానికి ఆయనకు మంత్రి పదవి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక రాధాని మంత్రిని చేయడం ద్వారా కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గానికి మరింతగా చేరువ కావాలని అది జమిలి ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఉపయోగపడుతుందని కూడా అలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి రాధా కాబోయే మంత్రిగారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News