వైసీపీని కాపాడేసిన లేడీ మెంబర్.. !
ప్రతిపక్ష వైసీపీలో లేడీ లీడర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున రెచ్చిపోయిన వారు.. పార్టీ అధికారం కోల్పోయాక.. దాదాపు సైలెంట్ అయ్యారు.
ప్రతిపక్ష వైసీపీలో లేడీ లీడర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున రెచ్చిపోయిన వారు.. పార్టీ అధికారం కోల్పోయాక.. దాదాపు సైలెంట్ అయ్యారు. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత వంటి ఫైర్ బ్రాండ్లు పార్టీనుంచి రిజైన్ చేశారు. ఇక, మాజీ మంత్రులు రోజా, తానేటి వనిత వంటి వారు అప్పుడప్పుడే మీడియా ముందుకు వస్తున్నారు. మిగిలిన వారిలో మేకతోటి సుచరిత సహా.. పలువురు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా వైసీపీకి బలమైన గళం అన్నట్టుగా వరుదు కళ్యాణి కనిపిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు ఆమె పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే.. వైసీపీలోనే సగం మందికి ఆమె ఎవరో కూడా తెలియదంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా శాసన మండలిలో ఆమె విజృంభించారు. దీంతో ఒక్కసారిగా మీడియా పతాక శీర్షికల వరకు వరుదు కల్యాణి ఎగబాకారు. మండలిలో బలమైన గళం వినిపించడతోపాటు.. ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలోని లోపాలను ఆమె ప్రశ్నించడంతో ప్రబుత్వం డిఫెన్స్‌లో పడినట్టయింది.
ఉద్యోగాల కల్పనపై గవర్నర్ చేసిన ప్రసంగంలోని లోపాలను వాస్తవానికి సీనియర్ నాయకుడు.. బొత్స సత్యనారాయణ ప్రస్తావించాలని అనుకున్నారు. కానీ, ఆయన ఎఫెక్టివ్‌గా ప్రశ్నించలేక పోయారు. దీంతో మైకు అందుకున్న వరుదు కల్యాణి.. సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా తెలుగు-ఇంగ్లీషు మీడియంపైన చర్చ వచ్చినప్పుడు.. మంత్రి నారా లోకేష్‌కు గట్టిగా బదులిచ్చారు. ఇక్కడ రాజకీయాలతో పనిలేకుండా.. ఒక సభ్యురాలిగా ఆమె చూపిన దూకుడు.. సంధించిన ప్రశ్నలు వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే.. వైసీపీకి బలమైన నాయకురాలు లభించినట్టు అయింది.
వరుదు కల్యాణికి నెటిజన్ల నుంచి బలమైన సపోర్టు తొలిసారి లభించడం ఇక్కడ విశేషం. ``నమస్తే మేడం మండలిలో మీరు మాట్లాడిన మాటలు మీరు చూపిన చొరవ మీరు చూపిన ధైర్య సాహసాలు, మొత్తం వైయస్సార్సీపి క్యాడర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఈరోజు నుంచి మేము మనస్పూర్తిగా మీ ఫ్యాన్ గా మారిపోయాను,`` అని నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం నెటిజన్ల నుంచే కాదు.. సభలో కూటమి సభ్యుల నుంచి కూడా వరుదు కల్యాణికి రాజకీయాలకు అతీతంగా గుర్తింపు లభించడం విశేషం. కూటమి పార్టీల్లోనూ వరుదుపై చర్చ సాగింది.