ఏపీలో స్వపక్షమే విపక్షం... మంత్రిపై ఎమ్మెల్యే ఆగ్రహం!

ఏపీ అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేని సంగతి తెలిసిందే. ఉన్న ఒక్క పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ గైర్హాజరవుతోంది

Update: 2024-11-18 17:13 GMT

ఏపీ అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేని సంగతి తెలిసిందే. ఉన్న ఒక్క పార్టీకీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ గైర్హాజరవుతోంది. ఈ సమయంలో ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో.. స్వపక్షమే విపక్షమైన వేళ అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇలా ఏపీ అసెంబ్లీలో విపక్ష సభ్యులు లేని లోటును తీరుస్తున్నారనుకోవాలో.. లేక, ప్రభుత్వం తమదైనా ప్రజా సమస్యల విషయంలో తగ్గేదేలే అని భావిస్తున్నారో.. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్ తమ తమ అభిప్రాయాలు స్పష్టం చెప్పారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే.. మంత్రి కొల్లు రవీంద్రపై ఫైర్ అయిన ఘటన జరిగింది.

అవును... మంత్రి కొల్లు రవీంద్రపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మైలవరంలో మైనింగ్ అక్రమాలు జరిగాయని.. అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి రవీంద్ర శాసన మండలిలో వ్యాఖ్యానించడంతో.. ఈ వ్యాఖ్యలపై 2019లోనూ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ హర్ట్ అయ్యారని అంటున్నారు!

కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో తన పరువుకు భంగం కలిగిందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు! మైలవరంలో జరిగిన మైనింగ్ అక్రమాల్లో తన పేరు ఏనాడూ రాలేదని చెబుతూ.. తన పేరును ఏ కేసులోనూ అధికారులు చేర్చలేదని అన్నారు. అయినప్పటికీ మైనింగ్ అక్రమాల్లో నాకు వాటా ఉందని మంత్రి చెప్పడం సరికాదని అన్నారు!

దీనిపై స్పందించిన కొల్లు రవీంద్ర.. వివరణ ఇచ్చారు! ఇందులో భాగంగా.. తాను అక్రమాల్లో ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని చెప్పాను కానీ.. మైలవరం గత ఎమ్మెల్యే అనలేదని వివరణ ఇచ్చుకున్నారు!

కాగా 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్.. టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమపై గెలుపొందారు. ఆ సమయంలో మైలవరంలో మైనింగ్ అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆందోళన చేశారు. అయితే... 2024 ఎన్నికల సమయంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు.

Tags:    

Similar News