రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటినే కూల్చేసిన ఎమ్మెల్యే
ప్రజాసేవలో రావాల్సిన మార్పు ఏమిటన్న విషయాన్ని ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపించటం ఆసక్తికరంగా మారింది
మాటలు చెప్పటం వేరు. చేతల్లో చూపించటం వేరు. నోరు తెరిస్తే ఆదర్శాలు వల్లించే రాజకీయ నేతలు ఎవరూ కూడా తమ సొంత ప్రయోజనాల్ని కాలదన్నుకోవటానికి ససేమిరా అంటారు. ఆదర్శాలు మొత్తం తమ వరకు రానంతవరక.. తమకు నష్టం చేయనంత వరకు మాత్రమే. లెక్కలు తేడా వస్తే మాత్రం.. తమ ప్రయోజనాల్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉండరు. అలాంటిది తాజాగా తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హాట్ టాపిక్ గా మారారు. రోడ్డు విస్తరణ కోసం తన సొంతింటిని కూల్చేందుకు సిద్ధం కావటమే కాదు.. తానే ముందుండి నడిపించిన వైనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇంతకూ ఆయన ఎవరో కాదు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం రేవంత్ ను.. మాజీ సీఎం కేసీఆర్ ను ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి.
ప్రజాసేవలో రావాల్సిన మార్పు ఏమిటన్న విషయాన్ని ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపించటం ఆసక్తికరంగా మారింది. ఆయన గొప్ప మనుసు పలువురు కీర్తిస్తున్నారు. తన నియోజకవర్గంలోని రోడ్డు విస్తరణ కోసం ఆయన తన సొంతింటిని కూల్చేసుకోవటానికి సిద్ధమయ్యారు. కామారెడ్డిలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో దాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న నిర్మాణాల్ని తొలగించాల్సి ఉంటుంది.
అయితే.. అలా తొలగించాల్సిన ఆస్తుల్లో ఎమ్మెల్యే ఇల్లు ఉంటే? ఇలాంటి పరిస్థితి వస్తే.. విస్తరణ ప్లాన్ ను పక్కన పెట్టేస్తారు. కానీ.. అందుకు భిన్నమైన సన్నివేశం కామారెడ్డిలో చోటు చేసుకుంది. అదేమంటే.. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు రెడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న వాటిల్లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. అలానే రెండు థియేటర్లు ఉన్నాయి.
ప్రస్తుత సీఎం.. మాజీ సీఎంలను ఎన్నికల్లో ఓడించిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి.. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని తన సొంత డబ్బులతో డెవలప్ చేస్తానని చెప్పటం తెలిసిందే. అందుకు అవసరమైతే రూ.100 కోట్లు ఖర్చుకు తాను వెనుకాడబోనని చెప్పారు. అన్నట్లే..రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిని అధికారులకు ఇచ్చేసిన ఆయన.. బుల్ డోజర్లు ఇంటిని పగలుకొట్టే వేళలో.. దగ్గర ఉండి మరీ పని చేయించిన వైనంపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఎక్కడో ఉంటారని.. వారి గురించి పేపర్లలో చదువుతుంటామని.. అలాంటిది తమ ఎమ్మెల్యేనే ఇంత గొప్ప మనసును ప్రదర్శించటాన్ని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.