విడదల రజనీతోనే అవ్వలేదు... ఇంకా చాలా గేమ్ ఉందా..?
తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులి వ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు.;

విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజిని, తదితరుల పై పదేళ్ల వరకు జైలుశిక్షకు వీలున్న ఐపీసీ సెక్షన్ 386ని చేర్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. పల్నాడు జిల్లా యడ్లపాడు లోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. అప్పటి అధికారి జాషువాతో కలిసి.. ఈ అక్రమాలకు మంత్రి, ఆమె కుటుంబం కూడా తెరదీసిందని సర్కారు భావిస్తోంది.
ఈ క్రమంలోనే.. పల్నాడు జిల్లా యడ్ల పాడు మండలం విశ్వనా థుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించి.. స్టోన్ క్రషర్‌పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే ఎమ్మెల్యేని కలవాలని హుకుం జారీ చేశారని అధికారులు తమ రిపోర్టులో రాసుకొచ్చారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని కార్యాలయానికి వెళ్లి కలిశారు.
తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులి వ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆరు రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేశారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదని అధికారులు గుర్తించారు.
అయితే.. ఈ వ్యవహారంలో రూ.2 కోట్ల మేరకు మంత్రికి చేరిందని తెలిసినా.. వైసీపీ కీలక నాయకులు మౌనం వహించారన్నది ఇప్పుడు తాజాగా తెరమీదికి వచ్చింది. దీని వెనుక చాలానే జరిగిందని విచారణ అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి.. ముడుపులు కేవలం మంత్రి, ఆమె కుటుంబానికి, ఐపీఎస్ అధికారికి(10 లక్షలు) మాత్రమే కాకుండా.. కీలక నాయకులకు కూడా ముట్టాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో.. వైసీపీ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేతను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.