గుంటూరులో “విడదల రజనీ” కిడ్నాప్ కలకలం... అసలేం జరిగింది?
నామినేషన్లు వేయడానికి ఈ రోజే చివరి తేదీ కావడంతో నేతలందరూ కూడా ఆర్వో కార్యాలయాలకు క్యూ కట్టారు.
నామినేషన్లు వేయడానికి ఈ రోజే చివరి తేదీ కావడంతో నేతలందరూ కూడా ఆర్వో కార్యాలయాలకు క్యూ కట్టారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ కు గురువారం చివరి రోజు కావడంతో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఇదిలా ఉంటే... గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.
అవును... ఈ రోజు ఎన్నికల నామినేషన్స్ కి చివరి తేదీ కావడంతో... అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి విడుదల రజిని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచి, మంత్రి అయిన రజనీ... ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడదల రజనీ అనే పేరున్న మరో మహిళ కూడా నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు.
వివరాళ్లోకి వెళ్తే... గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజిని పేరున్న మరో మహిళ సైతం పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ సమయంలో... ఆమె కిడ్నాప్ కి గురయ్యారనే వార్త హల్ చల్ చేసింది. నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్వో ఆఫీసుకు వచ్చిన ఆ మహిళను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారనే విషయం తీవ్ర సంచలనంగా మారింది.
అయితే... ఆ మహిళను వైసీపీ నాయకులే కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తే... వైసీపీకి నష్టం వాటిల్లుతుందనే ఆ పార్టీ నాయకులు ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారంటూ సందేహాలు వ్యక్తం చేశారు! మరోపక్క... ఇదంతా టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాల్లో భాగమని.. నేరుగా పోటీచేసి ఎదుర్కోలేక ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారని కామెంట్స్ చేశారు!
అయితే నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆమె ప్రత్యక్షమయ్యారు. ఈ సమయంలో.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆమె వెల్లడించారు. తాను బలవంతంగా నామినేషన్ వేసేందుకు రాలేదని తెలిపారు. దీంతో... ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు!