బండ్ల గణేష్, విజయశాంతిలకు టికెట్లు ఎందుకు నిరాకరించారు?

రాజకీయాలు, సినిమాలు బొమ్మాబొరుసులాంటివి. నాణానికి రెండు వైపులా ఉండే వీటి గురించి ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటుంది.

Update: 2024-03-25 10:28 GMT

రాజకీయాలు, సినిమాలు బొమ్మాబొరుసులాంటివి. నాణానికి రెండు వైపులా ఉండే వీటి గురించి ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటుంది. సినిమా వాళ్లు రాజకీయాల్లో చేరడం మామూలే. ఎందరో సినిమా వాళ్లు రాజకీయాల్లో చేరి ఔరా అనిపించుకున్నారు. కానీ ఈసారి మాత్రం సినిమా వాళ్లకు పార్టీలు నిరాకరించాయి. వారి ఆశలను గల్లంతు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గం అందరి నోళ్లలో నానుతోంది. ఇక్కడ నుంచి చాలా మంది టికెట్ ఆశించినా భంగపాటే ఎదురైంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ సినీనటి విజయశాంతి మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతకు ఆ అవకాశం దక్కింది. దీంతో మల్కాజిగిరి విషయంలో పార్టీలకు ముందు చూపు అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి టికెట్ కావాలని కోరినా అతడికి కూడా ఆ భాగ్యం దక్కలేదు. బండ్ల గణేష్ మొదటి నుంచి కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా టికెట్ విషయంలో మాత్రం అధిష్టానం తన పట్టు నిరూపించుకుంది. హస్తం పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన కినుక వహించినట్లు సమాచారం.

మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో కాలుపెట్టాలని చూస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆయనకు సైతం నిరాశే ఎదురైంది. దిల్ రాజు మొదట కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని అనుకున్నా తరువాత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఏదో ఒక టికెట్ వస్తుందని అనుకున్నా అది కూడా నెరవేరలేదు. దీంతో దిల్ రాజు అన్న నర్సింహారెడ్డికి నిజామాబాద్ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నా అధిష్టానం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

ప్రతిసారి సెలబ్రిటీలకు ఒకటో రెండో టికెట్లు కేటాయించే పార్టీలు ఈ సారి మాత్రం వారిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఎక్కడ కూడా సినీ ప్రముఖులకు చోటు దక్కలేదు. సినీ పరిశ్రమ వారిని కావాలనే దూరం పెట్టారా? లేక ఉద్దేశపూర్వకంగా చేశారా? అని అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ సారి సెలబ్రిటీల ఆశలు వమ్ము అయ్యాయనే చెప్పొచ్చు.

Tags:    

Similar News