ఢిల్లీ మద్యం స్కాం..అత్యధికంగా 22 నెలలు జైల్లో..ఆ సూత్రంతోనే బెయిల్

ఢిల్లీ మద్యం స్కాంలో ఆప్‌ కమ్యూనికేషన్స్‌ విభాగ మాజీ ఇంచార్జి విజయ్‌ నాయర్‌ కు తాజాగా బెయిల్ వచ్చింది.

Update: 2024-09-03 10:50 GMT

ఢిల్లీలో పురుడు పోసుకుని.. గోవాలో పెరిగి.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లో ఎదిగింది మద్యం కుంభకోణం.. ఇందులో పంజాబ్ కు చెందినవారి పాత్ర కూడా ఉందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇంతటి సంచలన కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, అప్పట్లో వైసీసీ ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఇంకా పలువురు రాజకీయ నాయకుల బంధువులు, ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (ఆప్) నాయకులు మద్యం స్కాంలో పూర్తిగా కూరుకుపోయారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంతో చాలామంది జైలు జీవితం గడిపారు.

సిసోదియా 17 నెలలు..

ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్ తర్వాత నంబర్ 2గా ఉంటూ.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన నాయకుడిగా మనీశ్ సిసోదియా అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. కానీ, లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలుపాలయ్యారు. ఈయన దాదాపు 17 నెలలు తిహాడ్ జైలులో గడిపారు. మరోవైపు సిసోదియా జైల్లో ఉన్న సమయంలో ఆయన భార్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంతో కూడా బెయిల్ పొందారు. గత నెలలో ఈయనకు బెయిల్ వచ్చింది.

కవిత 5 నెలలు..

మార్చి 15న అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహాడ్ జైలులో ఐదు నెలలు గడిపారు. పలుసార్లు బెయిల్ ప్రయత్నాలు చేసినా విఫలం కావడంతో కవిత బెయిల్ ఎప్పుడా? అని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. మాజీ ఎంపీ అయిన ఆమె.. లోక్ సభ ఎన్నికల సమయంలో పూర్తిగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు గత వారం కవితకు బెయిల్ వచ్చింది. ఆ వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశారు.

కేజ్రీవాల్ ఆరు నెలలుగా?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధానంగా ఉన్న సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మార్చిలోనే అరెస్టయ్యారు. అప్పటినుంచి తిహాడ్ జైల్లోనే ఉంటున్నారు. మధ్యలో మే నెలలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం రెండు వారాల బెయిల్ వచ్చింది. ఈ గడువు ముగిశాక మళ్లీ జైలుకెళ్లారు. అయితే, కేజ్రీకి ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. అంతలోనే సీబీఐ ఎంటరైంది. దీంతో విడుదల సాధ్యం కాలేదు. సీఎంగా ఆయన ఆరునెలలుగా జైల్లోనే ఉన్నారు. మళ్లీ బెయిల్ ఎప్పుడో చూడాలి.

ఈయన 22 నెలలు..

ఢిల్లీ మద్యం స్కాంలో ఆప్‌ కమ్యూనికేషన్స్‌ విభాగ మాజీ ఇంచార్జి విజయ్‌ నాయర్‌ కు తాజాగా బెయిల్ వచ్చింది. ఈయన అందరికంటే ఎక్కువగా 22 నెలలుగా జైలులో ఉన్నాచరు. కఠిన నిబంధనలతో కూడిన మనీ ల్యాండరింగ్ కింద కేసు నమోదైన విజయ్ నాయర్ కు బెయిల్ మంజూరు చేస్తూ.. న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూల్స్ కఠినంఅయినప్పటికీ స్వేచ్ఛ పరమ పవిత్రం అని జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ ఎస్వీఎన్ భట్‌ ల ధర్మాసనం పేర్కొంది. అంతేగాక.. ‘బెయిల్‌ అనేది నియమం...జైలు మినహాయింపు’ అనే సూత్రాన్ని ప్రస్తావించింది. ఈ ప్రకారం నిందితుడి (విజయ్ నాయర్)కి ఊరట కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత, గత నెల 9న మనీశ్‌ సిసోదియాకు బెయిల్‌ మంజూరు సందర్భంలోనూ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఇదే సూత్రాన్ని వర్తింపచేసింది. ఈ విషయాన్ని జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ ఎస్వీఎన్ భట్‌ ల ధర్మాసనం ప్రస్తావించించింది.

Tags:    

Similar News