స్టాలిన్ కి సర్కార్ సినిమా చూపిస్తున్న దళపతి విజయ్.. అన్నా డీఎంకే పని అయిపోయినట్లే..
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి ద్రవిడ పార్టీలకు ‘సర్కార్’ సినిమా చూపిస్తున్నారు.;

తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ హీరో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ పెను సంచలనం నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో విజయ్ పార్టీ అధికార డీఎంకేకి ప్రత్యామ్నాయంగా ఎదిగుతోందని వెల్లడైంది. దీంతో టీవీకే అధినేత దళపతి విజయ్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి ద్రవిడ పార్టీలకు ‘సర్కార్’ సినిమా చూపిస్తున్నారు.
దళపతి విజయ్ స్వయంగా నటించిన సర్కార్ సినిమాలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో పలు సన్నివేశాలకు తగ్గట్టు దళపతి తన సొంత రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా కూటమి కట్టేందుకు సిద్ధమంటూ ఇతర పార్టీలకు స్నేహ హస్తం చాచిన దళపతి తాజాగా స్వరం మార్చారని అంటున్నారు. తాను ఒక్కడినే బరిలో దిగుతా.. ఒక్కడినే డీఎంకేని ఓడిస్తానంటూ ప్రకటిస్తున్నారు. ఇక విజయ్ కి రాజకీయ సలహాలిస్తున్న ప్రశాంత్ కిశోర్ కూడా తమిళనాడులో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించడం గమనార్హం.
తమిళనాడులో అధికార డీఎంకేకు గట్టి పోటీగా తన పార్టీని సిద్ధం చేసేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ కసరత్తులు చేస్తున్నారు. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఎత్తుగడలు ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులకు అంతుచిక్కడం లేదని చెబుతున్నారు. 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ అధికార డీఎంకేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యే పోటీ ఉంటుందని ఆయన ఇటీవల చెబుతుండటం విశేషంగా చెబుతున్నారు. డీఎంకేని ఓడించి రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదల, కసితో విజయ్ అడుగులు వేస్తున్నారనే విషయం ఆయన వైఖరి, మాటలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.
గత ఎన్నికల్లో డీఎంకే గెలుపు ముఖ్యమంత్రి స్టాలిన్ బలం కాదని భావిస్తున్న విజయ్ అప్పట్లో అన్నా డీఎంకేపై అసంతృప్తి కారణంగానే డీఎంకే అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయపడుతున్నారట. దీనికి కారణంగా 2016 ఎన్నికల్లో 40.80 శాతం ఓట్లు సాధించిన అన్నాడీఎంకే 2024 పార్లమెంటు ఎన్నికల నాటికి 20.46 శాతానికి పడిపోయింది. దీనిని ఉదహరిస్తున్న విజయ్ అన్నాడీఎంకే ఓట్లన్ని డీఎంకేకి బదిలి అయ్యాయని, ఆ ఓట్లు పొందడం ద్వారా రాష్ట్రంలో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించవచ్చని విశ్లేషిస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో స్టాలిన్ కు ప్రత్యామ్నాయంగా తానే ఉంటే అధికారం కైవసం చేసుకోవడం కష్టమేమీ కాదని విజయ్ అభిప్రాయపడుతున్నారు. అందువల్లే కూటమి ఆలోచన విరమించుకున్నట్లు చెబుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కుమారుడు మిథున్ ఇటీవల విజయ్ తో భేటీ నిర్వహించి పొత్తు ప్రతిపాదన తీసుకువచ్చినా ఆయన తిరస్కరించినట్లు చెబుతున్నారు.
ఇక బీజేపీతోనూ విజయ్ దూరం పాటించాలనే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే ప్రతి కార్యక్రమంలోనూ బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారని అంటున్నారు. మరోవైపు తన రాజకీయ సిద్ధాంత నాయకుల్లో ఒకరిగా చెప్పిన తందై పెరియార్ ను ఎన్టీకే చీఫ్ కన్వీనర్ సీమాన్ తీవ్రస్థాయిలో దూషిస్తుండటంతో ఆయనతోనూ పొత్తు ఉండదని తెలుస్తుందని అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం యేయాలని భావిస్తున్న విజయ్.. రెండు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున కన్వీనర్లను నియమిస్తున్నారు. ఇలా మొత్తం 114 మందిని నియమించి, దిగువస్థాయిలో పదవులను భర్తీ చేయాలని సూచించారు. మొత్తానికి విజయ్ పార్టీ తమిళనాట ఇతర పార్టీలకు కంట్లో నలుసులా మారుతోందని అంటున్నారు.