‘‘ఇట్స్ రాంగ్ బ్రో..’’ప్రధాన పార్టీలకు ఇచ్చిపడేసిన తళపతి!
ఇప్పుడందరి కళ్లు తమిళనాడు రాజకీయాలపైనే ఉన్నాయి. వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఇప్పుడందరి కళ్లు తమిళనాడు రాజకీయాలపైనే ఉన్నాయి. వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరుగబోతున్నాయి. అధికార పార్టీ డీఎంకేకు దీటైన పార్టీ లేదక్కడ. మళ్లీ డీఎంకేకే విజయం తప్పదనుకున్నారు అంతా..కానీ తళపతి విజయ్ ఎంట్రీతో అక్కడ పొలిటికల్ సీన్ మారిపోయింది. మన తెలుగులో పవన్ కల్యాణ్ లాగా అక్కడ విజయ్ కు సైతం అంతే ఫాలోయింగ్ ఉంటుంది. రజినీకాంత్ తర్వాత ఆ స్థానాన్ని విజయ్ భర్తీ చేస్తున్నారు. తమిళనాడులో వ్యక్తి ఆరాధన ఎక్కువ అని తెలిసిందే. విజయ్ తనకున్నా ఫాలోయింగ్ ను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చేశారు. డీఎంకేకు దీటైన పార్టీ లేకపోవడం..అన్నాడీఎంకే ప్రభావం తగ్గిపోవడం.. బీజేపీ ఇప్పుడిప్పుడే అక్కడ స్టాండ్ అవుతుండడం..విజయ్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా కనపడుతున్నాయి.
గతేడాది పార్టీని ప్రారంభించిన విజయ్..ఫిబ్రవరి 26న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా పూంజేరి గ్రామంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో పార్టీ రెండో వార్షిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డీఎంకే, బీజేపీపై వేసిన సెటైర్లు తెగ వైరల్ అవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగం (టీవీకే) అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాష అనేది వ్యక్తిగతమని, దానిని బలవంతంగా రుద్దడం సమాఖ్య విధానానికి వ్యతిరేకమన్నారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయకుంటే విద్య నిధులను మంజూరు చేయబోమని కేంద్రం చెబుతోందని, నిధులు ఇవ్వడం కేంద్రం బాధ్యత అని, వాటిని పొందడం రాష్ట్ర ప్రభుత్వ హక్కు అని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన భాషా విధానంపై ఎల్ కేజీ, యూకేజీ పిల్లల తరహాలో ‘ఎక్స్’ వేదికగా కొట్టుకుంటున్నారన్నారు. వారు ఘర్షణ పడినట్టు నటిస్తే దానిని మనం నమ్మాలా అంటూ.. వాట్ బ్రో.. ఇట్స్ వెరీ రాంగ్ బ్రో..అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల డిమాండ్లను నెరవేర్చలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలను గాలికొదిలేసి ఆ పార్టీలు పరస్పర విమర్శలకు దిగుతున్నాయని ఆరోపించారు. ఇక చివర్లో పార్టీల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. టీవీకేను గెలిపించి తమిళనాడులో ధోనిని మించిన పాపులారిటీని సాధిస్తానని అభిమానులను ఉత్సాహపరిచారు.
పార్టీ ఆవిర్భావ సభలో విజయ్ మాటు ప్రస్తుతం తమిళనాడును షేక్ చేస్తున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు ఉండటంతో రాజకీయాలను విజయ్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. ఇదే సినిమా చివరిది అన్నట్టుగా అక్కడ ప్రచారం జరుగుతోంది. డీఎంకే అపొజిషన్ పార్టీల్లో స్టార్ డమ్ ఉన్న నేతలు ఎవరూ లేకపోవడంతో విజయ్ కు ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఓట్లనే కాకుండా సగటు ఓటరు మనస్సు గెలిచినప్పుడే విజయ్ పార్టీకి విజయం చేకూరే అవకాశాలు ఉన్నాయి.