కంగ్రాట్స్ ...అంటూ రఘురామకే షాక్ ఇచ్చిన నేత
అలాగే మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ఆయనలోని ఆనేక పాజిటివ్ పాయింట్స్ ని సభలో ప్రస్తావించారు.
ఏపీ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన ఉండి శాశనసభ్యుడు రఘురామ క్రిష్ణం రాజుని అంతా అభినందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రఘురామ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అలాగే మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు ఆయనలోని ఆనేక పాజిటివ్ పాయింట్స్ ని సభలో ప్రస్తావించారు.
ఆ విధంగా రఘురామకు అభినందనలు వెల్లువలా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు అనూహ్యంగా ఒక నేత నుంచి గ్రీటింగ్స్ రావడం రాజకీయంగా విశేష పరిణామమే అని అంటున్నారు. రఘురామ ఉప సభాపతి కావడం పట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత అయిన వి విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ రఘురామ రాజుని కొత్త పదవిలో మరింతగా రాణించాలని కోరారు. అంతే కాదు ఆయన ఈ పదవిలో బాగా పనిచేయాలని ఆకాంక్షించారు
సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని మీరు నిలబెడతారన్న నమ్మకం నాకుంది. గతంలో జరిగిన ఘటనలను గతానికే వదిలేసి, గతకాలపు నీడల నుంచి పైకి ఎదుగుతారని... తద్వారా గౌరవప్రదమైన పదవికి వన్నె తెస్తారని విశ్వసిస్తున్నాన అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక విజయసాయిరెడ్డి కంగ్రాచ్యులేషన్స్ శ్రీ రఘురామకృష్ణ రాజు గారూ అంటూ విజయసాయి ట్వీట్ చేయడం పట్ల అయితే చర్చ సాగుతోంది. వైసీపీ ఎంపీగా రఘురామ ఉన్న టైం లో విజయసాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగారు. 2020 టైం లో కరోనా మంచి పీక్స్ లో ఉన్న వేళ ఏపీ నుంచి కొంతమంది ఎంపీలను తీసుకుని ఆయన ఢిల్లీ వెళ్ళి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ అనర్హత పిటిషన్ ఇచ్చి ఆయనను తక్షణం ఎంపీ పదవి నుంచి తొలగించాలని కోరారు.
ప్రత్యేక విమానంలో ఈ విధంగా వైసీపీ ఎంపీలు అంతా కట్టకట్టుకుని మరీ ఢిల్లీ వెళ్ళి తమ పార్టీకే చెందిన ఒక ఎంపీ విషయంలో ఇంత సీరియస్ గా ఫిర్యాదు చేయడం అప్పట్లో చర్చగా సాగింది. దాని తరువాత రఘురామ వర్సెస్ విజయసాయిరెడ్డి అన్నట్లుగా రాజకీయ విమర్శలు కూడా సాగాయి.
ఇపుడు చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు. ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ కి ఆయన అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి రఘురామకు అభినందనలు తెలపడం అంటే అది రాజకీయంగా కీలకమే అని అంటున్నారు. అయితే ఒకనాటి తన సహచరుడిని విజయసాయిరెడ్డి అభినందించారు అని ఇందులో తప్పు లేదని అంటున్నారు.
అయితే మొత్తం వైసీపీలో ఆయన ఒక్కరే అభినందించడమూ చర్చకు తావిస్తొంది. రఘురామ వైసీపీలో నాలుగున్నరేళ్ల పాటు రెబెల్ ఎంపీగా కొనసాగారు. అలా జగన్ ని ఎదిరించిన ఆయన విషయంలో ఈ తరహా అభినందనలు ఎవరూ చేయడానికి సాహసించలేదనే అంటున్నారు. విజయసాయిరెడ్డి మాత్రం కంగ్రాట్స్ చెబుతూ ఏకంగా రఘురామకే షాక్ ఇచ్చేశారు అంటున్నారు.