ఫెంగల్ పేరు చెప్పి డీఎంకేపై విజయ్ విమర్శల తుఫాన్!

అవును... తమిళనాడులోని డీఎంకె ప్రభుత్వంపై తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, సినిమా హీరో విజయ్ మండి పడ్డారు.

Update: 2024-12-04 12:30 GMT

ఫెంగల్ తుఫాను తమిళనాడును వణికించిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది వరుస తుఫానులు తమిళనాడును తడిపి ముద్ద చేశాయి. ఈ సమయంలో తాజాగా వచ్చిన ఫెంగల్ తుఫాను సహాయక చర్యలపై హీరో విజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాత్కాలిక పరిష్కారాలతో సరిపెడుతున్నారంటూ డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

అవును... తమిళనాడులోని డీఎంకె ప్రభుత్వంపై తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, సినిమా హీరో విజయ్ మండి పడ్డారు. ఈ మేరకు ఎక్స్ లో భారీ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా.. తుఫాను రిలీఫ్ లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ తాత్కాలికమైనవేనని.. దీర్ఘకాలిక పరిష్కారలేమీ చూపడం లేదని అన్నారు.

ఏదైనా విపత్తు జరిగినప్పుడు అదేదో సంప్రదాయంలాగా కొన్ని ప్రాంతాలు సందర్శించడం.. ఆహారం పంపిణీ చేయడం.. ఫోటోలు దిగడం తప్ప ఏమీ చేయడం లేదని.. ఇవి కూడా మీడియా ఫోకస్ ఉన్నంతవరకే అని అన్నారు. భారీ వర్షాలు, వరదలు వస్తాయని హెచ్చరించినా ముందసు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఫైర్ అయ్యారు.

ప్రకృతి విపత్తుల సమయంలో తమ ప్రజల భద్రతకు భరోసా కల్పించే ప్రాథమిక బాధ్యతను ప్రభుత్వం మరిచిపోతుందని.. ఒకటి రెండు రోజులు ప్రజలను కలవడం, వారికి తాత్కాలిక పరిష్కారాలను అందించడంతోనే సరిపెడుతుందని అన్నారు. విపత్తు సంసిద్ధత, వాతావరణ మార్పుల ఉపశమనానికి దీర్ఘకాలిక చర్యలు అవసరం అని సూచించారు!

అసమ్మతివాదులను ప్రభుత్వ వ్యతిరేకులుగా డీఎంకే ప్రభుత్వం ముద్ర వేస్తుందని.. లేదంటే వారికి 'కాషాయం' అంటగట్టి విమర్శలను రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో... ప్రతిపక్షాలను విమర్శించడం ద్వారా జవాబుదారీతనం నుంచి తప్పించుకోవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోందని విమర్శించారు.

ఈ సందర్భంగా... తమిళనాడు, పుదుచ్చేరిలోని వరద బాధిత ప్రాంతలకు ఆహారం, తాగునీరు, కిరాణా వంటి సహాయాన్ని అందించడం కొనసాగించాలని తన పార్టీ క్యాడర్ ను విజయ్ కోరారు. ఇప్పటికే వారు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా ప్రశంసించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News