విమానాశ్రయంలో విజయ్ - త్రిష విజువల్స్... డీఎంకేపై బీజేపీ ఫైర్!

ఈ సమయంలో ఎయిర్ పోర్టులో వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి, వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై బీజేపీ మండిపడింది.

Update: 2024-12-19 17:32 GMT

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో అందరికీ సమానదూరం పాటిస్తున్నారు హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్. ఇదే సమయంలో... కలిసొచ్చేవారికి అధికారంలో వాటా అనే కామెంట్లూ వినిపించారు! ఈ నేపథ్యలో విజయ్ పర్సనల్ టూర్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట దర్శనమివ్వడంపై డీఎంకే ను తీవ్రస్థాయిలో విమర్శించింది బీజేపీ.

అవును... ఇటీవల హీరో విజయ్ - త్రిష కలిసి హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం కోసం గోవాకు ప్రైవేట్ విమానంలో కలిసి ప్రయాణించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యి, వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై బీజేపీ మండిపడింది.

ఇందులో భాగంగా... చెన్నై విమానాశ్రయంలో విజయ్ - త్రిష ఫోటోల విడుదల వెనుక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉందని.. వారు ఫోటోలను తీసి డీఎంకే పార్టీ ఐటీ విభాగానికి ఇచ్చారని.. వారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆరోపించారు. ప్రైవేట్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్న సమయంలో వారి వీడియో తీశారని అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... విజయ్ రాజకీయాల్లోకి వచ్చారని.. గత వారం గోవాలో ఓ వివాహ కారక్రమానికి వెళ్లారని.. ఆ సమయంలో అతను చెన్నై ఎయిర్ పోర్ట్ లోని గేట్ నెంబర్ 6 నుంచి లోనికి వెళ్లి, ప్రైవేట్ విమానంలో బయలుదేరారని.. ఈ సమయంలో అతని ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయని అన్నామలై ప్రశ్నించారు.

ఇదే సమయంలో... ఆ ఫోటోలను తమిళనాడు అధికారపార్టీ సోషల్ మీడియా టీమ్ కి ఎవరు అందించారని అడిగారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని.. దీనిపై కేంద్ర పౌర విమానయాన మంత్రికి లేఖ రాస్తామని.. ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసేందుకు వీలుగా ఈ ఫోటోలు ఎవరు తీశారో మంత్రిత్వ శాఖ కనిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నామలై అన్నారు.

దీంతో... టీవీకే పార్టీ అధినేతపై ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకోవాలని బీజేపీ భావిస్తుందా.. లేక, డీఎంకేని ఇరుకున పెట్టడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోవాలనుకుంటుందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News