ఈడీ విచారణ తర్వాత విజయసాయి ఏం చెప్పారు?

అధికారుల విచారణ అనంతరం నేరుగా మీడియా వద్దకు వచ్చారు. ఈడీ విచారణలో ఏమేం జరిగిందో చెప్పుకొచ్చారు.

Update: 2025-01-07 04:34 GMT

ఏసీబీ.. ఈడీ.. విచారణ తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరూ మీడియా ముందుకు రావటం.. మాట్లాడటం లాంటివి చేయరు. ముఖం తప్పిస్తారు. లేదంటే.. మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తారు.అందరిలా వ్యవహరిస్తే ఆయన్ను విజయసాయి అని ఎందుకు అంటారు చెప్పండి. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు. కాకినాడ సీ పోర్టు అమ్మకానికి సంబంధించి ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆయన.. అధికారుల విచారణ అనంతరం నేరుగా మీడియా వద్దకు వచ్చారు. ఈడీ విచారణలో ఏమేం జరిగిందో చెప్పుకొచ్చారు.

తనను మొత్తం పాతిక ప్రశ్నలు అడిగారని.. కర్నాటి వెంకటేశ్వర్ రావు (కేవీ రావు) కంప్లైంట్ కారణంగా విచారణ చేశారన్న విజయసాయి.. ‘‘ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేశారు. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్టు గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లుగా ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలీదు. అతనితో ఎలాంటి సంబంధం లేదు. ప్రజాప్రతినిధిగా ఉన్న నా దగ్గరకు ఎంతో మంది వస్తారు. కాకినాడ సీపోర్టు విషయంలో ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీ రావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం’’అని పేర్కొన్నారు.

కాకినాడ పోర్టు షేర్ బదిలీలో తనకు సంబంధం లేదని.. కేవీరావు మీద తాను పరువునష్టం దావా వేయనున్నట్లుగా వెల్లడించారు. తనకు సంబంధం లేని విషయంలో తనపై ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండించారు. సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్పానని చెప్పనన్న విజయసాయి.. సుబ్బారెడ్డి కొడుకుగానే విక్రాంత్ రెడ్డి తెలుసని.. అతనితో నాకేం సంబంధమని ప్రశ్నించారు. తాను 2020 మేలో ఫోన్ చేసినట్లుగా కేవీ రావు చెబుతున్నారు. కాల్ డేటా తీస్తే.. నేనుకాల్ చేశారో లేదో చూసుకోవచ్చన్నారు.

రంగనాధ్ కంపెనీని ప్రభుత్వానికి ఎవరు పరిచయం చేశారని ఈడీ ప్రశ్నించిందన్న విజయసాయి.. తనకు ఆ విషయంలో సంబంధం లేదని.. తానో సాధారణ ఎంపీనని చెప్పినట్లుగా వెల్లడించారు. శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవరు నియమించారో తనకు తెలీదని తాను చెప్పినట్లు చెప్పారు. శరత్ చంద్రారెడ్డితో తనకున్న సంబంధం గురించి అడిగారని.. తమ ఫ్యామిలీ రిలేషన్ తాను చెప్పానన్నారు. సండూర్ పవర్ కంపెనీలో 22 ఏళ్ల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి అడిగారు.. కొన్నేళ్ల క్రితం జరిగిన లావాదేవీల గురించి ఇప్పుడు ఎలా చెప్పగలను? అంటూ వివరించారు. ఈడీ విచారణ ఎదుర్కొని.. అక్కడ అడిగిన ప్రశ్నల వివరాలు ఇంత వివరంగా వెల్లడించిన ప్రజాప్రతినిధిగా విజయసాయి ప్రత్యేకంగా నిలుస్తారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Tags:    

Similar News