ఐక్యరాజ్య సమితిలో విజయసాయిరెడ్డి

వైసీపీలో కీలక నేత రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది.

Update: 2024-11-19 06:50 GMT

వైసీపీలో కీలక నేత రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అయినా సరే ఒక వైసీపీ ఎంపీకి గొప్ప ఛాన్స్ ని కేంద్రం ఇచ్చింది. ఐక్య రాజ్య సమితి 79వ సదస్సుకు హాజరయ్యే భారత ప్రతినిధి బృందంలో వివిధ పార్టీలకు కేంద్రం అవకాశం కల్పించింది.

అందులో విజయసాయిరెడ్డి కూడా ఉండడం విశేషం. ఏపీలో రాజకీయ పరిణామాలు చూసినా లేక వైసీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినా విజయసాయిరెడ్డిని కేంద్రం ఈ విధంగా ఎంపిక చేసి పంపించడం అన్నది గ్రేట్ అనే అంటున్నారు. కేంద్రం వైసీపీకి ఈ విధంగా మంచి అవకాశం ఇవ్వడం పట్ల రాజకీయ చర్చ కూడా సాగుతోంది.

ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు బీజెపీ వరిష్ట నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ కి ఐక్య రాజ్య సమితికి ప్రాతినిధ్యం వహించే భారత బృందానికి లీడర్ గా ఎంపిక చేసి పంపించారు. అప్పట్లో అది పెద్ద వార్త. సంచలనం రేకేత్తించించి కూడా. ఎందుకంటే అధికార పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ నాయకత్వం విపక్ష పార్టీకి అప్పగించడం అంటే పీవీ రాజకీయ ధురీణకు ప్రతీక అని అంతా అనుకున్నారు. అదే సమయంలో అందరివాడుగా ఉన్న వాజ్ పేయ్ కి అది ఒక గౌరవంగా కూడా చెప్పుకున్నారు.

అయితే ఆనాటి పరిస్థితిలను ఆ రాజకీయాలను ఆ నాయకులు ముందు పెట్టి పోలిక తేవడం కుదిరే వ్యవహారం కాదు కానీ విజయసాయిరెడ్డికి ఐక్య రాజ్యసమితికి వెళ్ళే భారత బృందంలో ఎంపిక చేసి పంపడం మాత్రం చూస్తే ఎన్డీయేకు వైసీపీ పట్ల ఇంకా కొంత సాఫ్ట్ కార్నర్ ఉందనే అనుకోవాలని అంటున్నారు

ఇవన్నీ పక్కన పెడితే ఐక్య రాజ్యసమితి భద్రతామండలిని సందర్శించిన విజయసాయిరెడ్డి అంతకు ముందు జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహాత్ముడు ప్రవచించిన శాంతి అహింస, ఐక్యత ప్రపంచానికి ఈ రోజుకీ ఆదర్శమైనది అని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఐక్యరాజ్య సమితి 79వ సెషన్ లో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ఇది గొప్ప గౌరవం అని అంతా అంటున్నారు. ఏది ఏమైనా 2016 నుంచి రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి పార్లమెంట్ లో సీనియర్ నేతగా పేరుంది. పైగా వైసీపీకి సంబంధించి ఆయన చాలా కాలం పాటు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నాయకుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ చాన్స్ దక్కింది అని అంటున్నారు.

Tags:    

Similar News