ఏసీబీ ఎదుట జగన్ జమానా అధికారి.. నేడూ కొనసాగనున్న విచారణ
గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సమాచార, పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.;

గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సమాచార, పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కేంద్ర సర్వీసులకు చెందిన విజయకుమార్ రెడ్డి డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చి గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన రాష్ట్రం నుంచి రిలీవ్ అయి తన సొంత డిపార్ట్మెంటుకు వెళ్లిపోయారు. అయితే ఆయన పనిచేసిన కాలంలో కొందరికి, ముఖ్యంగా సాక్షి మీడియాకి అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా, విచారణకు డుమ్మాకొట్టిన విజయకుమార్ రెడ్డి కోర్టు జోక్యంతో ఎట్టకేలకు హాజరయ్యారు. అయితే తొలిరోజు విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఏసీబీ అధికారులు గురువారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.
గత ప్రభుత్వంలో పనిచేసిన పలువురు అధికారులపై కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడంతోపాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఎంతటివారైనా విడిచిపెట్టడం లేదని అంటున్నారు. ఇప్పటికే బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి వంటివారిని అరెస్టు చేయించిన ప్రభుత్వం తాజాగా ఆ జాబితాలో ఐ అండ్ పీఆర్ పూర్వ కమిషనర్ విజయకుమార్ రెడ్డిని చేర్చింది. ప్రస్తుతానికి ఆయన అరెస్టు కానప్పటికీ, ఏసీబీ విచారణ తర్వాత ఎప్పుడైనా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాయలసీమ ప్రాంతానికి చెందిన విజయకుమార్ రెడ్డి కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. జగన్ సీఎం అవ్వకముందు నిర్వహించిన పాదయాత్రకు మద్దతు ప్రకటించిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. కీలకమైన ఐ అండ్ పీఆర్ కమిషనర్ బాధ్యతలతోపాటు అదనంగా సీఎంవోలోనూ పనిచేశారు. అయితే ఆయన హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తోపాటు ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంటులో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తొలుత విజిలెన్స్ విచారణ జరిపించిన ప్రభుత్వం దాని నివేదిక ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేయించింది. దీంతో మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి. బుధవారం ఏసీబీ విచారణకు వచ్చిన ఆయనకు పలు ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారని చెబుతున్నారు.
ఉదయం 10.40 నుంచి రాత్రి 7.20 వరకు విజయకుమార్ రెడ్డిని ఏసీబీ విచారించింది. సుమారు 20 ప్రశ్నలు వేస్తే ఆయన దేనికీ సరైన సమాధానం చెప్పలేదని, అందుకే గురువారం కూడా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక, టీవీ చానళ్లకు ఎవరి ఒత్తిళ్ల మేరకు అనుచిత లబ్ధి చేకూర్చారు? ఐదేళ్లలో ప్రభుత్వం జారీ చేసిన మొత్తం ప్రకటనల్లో దాదాపు 43 శాతం ప్రకటనలను సాక్షి గ్రూపుకే ఎందుకు ఇచ్చారు? ఔట్ సోర్సింగు ఉద్యోగుల నియామకాల్లో ఎందుకు పాటించలేదు? ఎవరి సిఫార్సులతో ఉద్యోగులను నియమించారు? సాక్షి పత్రిక టారిఫ్ ను కమిటీ సిఫార్సులకన్నా అధికంగా ఎందుకు నిర్ణయించారు? వంటి ప్రశ్నలు వేసినట్లు సమాచారం. నిబంధనలు ధిక్కరించి ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని మాజీ కమిషనర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది.