ఇది విజయా రాజశేఖర్ రెడ్డి ఆవేదన...పవర్ ఫుల్ వార్నింగ్

తన మీద తమ కుటుంబం మీద రాస్తున్న దారుణమైన రాతలను ఇకనైనా ఆపాలని ఆయన కోరారు.

Update: 2024-11-06 03:54 GMT

దివంగత నేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ వీడియో బైట్ ని తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. రాజకీయాల్లో ఇంతటి దిగజారుడు తనమా అని ప్రశ్నించారు.

తన మీద తమ కుటుంబం మీద రాస్తున్న దారుణమైన రాతలను ఇకనైనా ఆపాలని ఆయన కోరారు. లేకపోతే తాను పరువు నష్టం దావా వేస్తాను అని ఘాటు హెచ్చరిక చేశారు. ఇంతకీ విజయమ్మ ఆ వీడియో బైట్ లో ఏమన్నారో చూస్తే కనుక చాలా విషయాలే చెప్పారు.

ఏ కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉండవని ఆమె ప్రశ్నించారు. తనకు తన బిడ్డలు రెండు కళ్ళు అని చెప్పుకున్నారు. వారిని సంస్కారవంతంగా పెంచామని అన్నారు. వారు సమాజానికి సేవ చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని అన్నారు. కుటుంబంలో వచ్చిన విభేదాలు మామూలే అన్నట్లుగా ఆమె చెప్పారు.

ఏదైనా విభేదం వచ్చినంత మాత్రాన జగన్ తనకు కుమారుడు కాకుండా పోతారా లేక ఆయనకు తాను అమ్మను కాకుండా పోతానా అని ప్రశ్నించారు. అలాగే షర్మిలకు జగన్ అన్నయ్య కాకుండా పోతారా అని జగన్ కి షర్మిల చెల్లెలు కాకుండా పోతుందా అని ప్రశ్నించారు.

ఎపుడో రెండేళ్ల క్రితం జరిగిన ఒక కారు యాక్సిడెంట్ ని పట్టుకుని తన కుమారుడితో ముడిపెట్టి తప్పుడు రాతలు రాయడమేంటని ఆమె ఆగ్రహించారు. తాను మనవడి దగ్గరకు అమెరికా వెళ్తే దానికి కూడా వక్రభాష్యం చెప్పి కట్టు కధలు రాసారని ఆమె మండిపడ్డారు. ఇదే తీరున తప్పుడు కధనాలు రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని తాను కచ్చితంగా పరువు నష్టం దావా వేసి అలాంటి రాతలు రాసిన వాళ్ళను కోర్టుకు ఈడుస్తానని ఆమె హెచ్చరించారు.

మరోవైపు చూస్తే రాజకీయాలు చేస్తే జగన్ తో డైరెక్ట్ గా చేయండి అని ఆమె అనడం విశేషం. అంతే తప్ప కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు ఎందుకు అని నిలదీశారు. ఇవన్నీ మీకు తప్పుడుగా అనిపించడం లేదా, జుగుప్సగా అనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు.

మీ రాజకీయాల కోసం ఇంతలా దిగజారిపోవాలా అని ఆమె అన్నారు. షర్మిల నా కూతురే కాదని అంటున్నారని ఇదేమి రాజకీయం అని ఆమె ప్రశ్నించారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడమేంటి అని ఆమె నిలదీశారు. ప్రజలు అందరినీ గమనిస్తున్నారు అని ఆమె అన్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం ఇకనైనా ఆపేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరో వైపు తాను ఇటీవల రాసిన రెండు లేఖలు స్వయంగా తాను రాసినవే అని ఆమె స్పష్టం చేశారు. అవి ఫేక్ లెటర్లు అని తప్పుడు ప్రచారం చేయడం పట్ల మండిపడ్డారు. విజయా రాజశేఖర్ రెడ్డి ఆవేదన అంటూ ఆమె వదిలిన ఈ వీడియో బైట్ ఇపుడు వైరల్ అవుతోంది. మొత్తం మీద విజయమ్మ మాత్రం సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీం మీడియా మీద కూడా నిప్పులు చెరిగారు.

Tags:    

Similar News