ఎలా స్పందించాలో అర్థం కాలేదా? విజయసాయి రాజీనామాపై డైలమాలో వైసీపీ

విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధిష్టానం తగిన రీతిలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Update: 2025-01-26 09:30 GMT

"మేమే మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ, ఇప్పటికీ మిమ్మలను గౌరవిస్తాం. మా పార్టీ ఆవిర్భావం నుంచి మీరు మా పార్టీకి బలమైన మూల స్తంభాల్లో ఒకరు. కష్ట సమయాల్లోనూ.. విజయాల్లో.. రెండింటిలోనూ మాతో నిలబడి ఉన్నారు. రాజకీయాల నుంచి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం."ఇది విజయసాయి రాజీనామాపై వైసీపీ స్పందన. పార్టీ కీలక నేత, అందునా పార్లమెంటరీ పార్టీ నేత హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎలా స్పందించాలో వైసీపీకి అర్థం కాలేదా? లేక విజయసాయి ఎప్పుడు తప్పుకుంటాడని ఎదురుచూసిందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ టు నేతగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ అధినేత జగన్ కష్టసుఖాల్లో విజయసాయిరెడ్డి లేని సమయం లేదు. అలాంటి నేత హఠాత్తుగా పార్టీ నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు షాక్ తిన్నాయి. ఉరుములేని పిడుగులా విజయసాయి ఎందుకీ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఈ పరిణామాన్ని ముందే ఊహించినట్లు, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

వైసీపీ తన ప్రకటనలో చెప్పినట్లు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి కచ్చితంగా మూల స్తంభమే. ఏ అంశానికైనా మంచి చెడు అన్నట్లు విజయసాయి వల్ల ఆ పార్టీకి లాభమూ, నష్టమూ జరిగి ఉండొచ్చు. కానీ అది ఆ పార్టీ అంతర్గత విషయం. పార్టీలో ఓ ఉన్నతస్థాయి నేత అనూహ్యంగా అస్త్ర సన్యాసం చేయడం, దాన్ని పార్టీ నిలువరించే ప్రయత్నం చేయకపోవడం వల్ల కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతిస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ కోసం ఎంతో చేసిన విజయసాయిరెడ్డి వంటి వారినే కాపాడుకోలేకపోతే, మనకి ఎవరు దిక్కు అవుతారని దిగువస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధిష్టానం తగిన రీతిలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత అందుబాటులో లేకపోయినా, మిగిలిన సీనియర్ నేతలైనా ఆయనతో మాట్లాడాలితే బాగుండేదని అంటున్నారు. పార్టీలో ముఖ్య నేతలైన సజ్జల రామక్రిష్ణారెడ్డి, బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు ఏ మాత్రం చలించకపోవడంతో వైసీపీ పెద్దలకు తెలిసే విజయసాయిరెడ్డి తప్పుకున్నానే అభిప్రాయాన్ని కలిగించినట్లైందని అంటున్నారు.

విజయాసాయి రాజకీయ సన్యాసానికి ఆయన బెబుతున్న కారణాలు ఎంతవరకు వాస్తవమున్నదో కానీ, ప్రభుత్వ చర్యలకు భయపడే ఆయన రాజకీయాలకు దూరమయ్యారనే ఎక్కువ మంది అనుకుంటున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతోపాటు మద్యం, మైనింగ్, ఇసుక కుంభకోణాల్లో ఆయనపై కేసులు కత్తి వేలాడుతోందని చెబుతున్నారు. కాకినాడ పోర్టు ఇష్యూలో విజయసాయి వియ్యంకులు కూడా ఇరుక్కోవడం వారిని కాపాడే ప్రతయ్నంలో విజయసాయి విఫలమవడంతోనే ప్రధానంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలగాల్సివచ్చిందంటున్నారు. ఈ విషయంపై వైసీపీ అధిష్టానానికి ముందే సమాచారం ఉన్నా తగిన భరోసా ఇవ్వలేకపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా విఎస్ఆర్ రాజకీయ సన్యాసం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News