వివేకా హత్య, జగన్ అక్రమాస్తుల కేసు... సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

అవును... ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన వివేకానంద రెడ్డి హత్య కేసుపై తాజాగా విజయసాయిరెడ్డి స్పందించారు.

Update: 2025-01-25 09:31 GMT

వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. శుక్రవారం ప్రకటించినట్లుగానే శనివారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన వివేకానంద రెడ్డి హత్య కేసుపై తాజాగా విజయసాయిరెడ్డి స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి తప్పించుకోవడంలో భాగంగానే రాజీనామా చేశారనే ఆరోపణలు ఖండిస్తూ... నాడు అవినాశ్ రెడ్డికి కాల్ చేసినప్పుడు ఏమి జరిగిందనే విషయాలను వెల్లడించారు.

ఇందులో భాగంగా... వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినట్లు తెలిసి షాకైనట్లు చెప్పిన సాయిరెడ్డి.. వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేయగా.. అవినాష్ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారని చెప్పారు. ఆ వ్యక్తి తనతో.. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని.. నాడు ఫోన్ లో వచ్చిన సమాచారమే తాను మీడియాకు చెప్పానని సాయిరెడ్డి వివరణ ఇచ్చారు.

ఇదే సమయంలో... తాను భగవంతుడి మీద ప్రమాణం చేసి నిజమే చెబుతున్నాను అని చెబుతూ... తాను ఎలాంటి పదవులు ఆశించో, కేసులు మాఫీ చేస్తారని హామీ తీసుకునో ఈ రాజీనామా చేయడం లేదని.. కేసులకు భయపడే వ్యక్తి తాను కాదని.. కేవలం తన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని సాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

ఎవరి బలవంతమూ లేదు, బెదిరింపూ లేదు, పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ సభ్యత్వానికి, రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు సమర్పించానని.. ఆయన దాన్ని ఆమోదించారని చెప్పారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక తన రాజీనామా విషయంపై లండన్ లో ఉన్న వైఎస్ జగన్ తో తాను మాట్లాడి అన్ని విషయాలు వివరించినట్లు చెప్పిన సాయిరెడ్డి.. జగన్ తో మాట్లాడిన తర్వాతే తన ఫైనల్ నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఇక పార్టీకి రేపు రాజీనామా చేస్తానని అన్నారు. రాజకీయాల నుంచే తప్పుకున్నాక ఇక తనకు ఎలాంటి సభ్యత్వం ఉండదని అన్నారు.

ఇదే సమయంలో... రాజకీయ జీవితంలో తాను ఏనాడూ అబద్ధాలు చెప్పలేదని.. మూడు తరాలుగా జగన్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆ కుటుంబంతో ఏ రోజూ విభేదాలు లేవని.. ఇంతవరకు రాలేదని.. భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం లేదని సాయిరెడ్డి స్పష్టం చేశారు.

నాడు జగన్ తో కలిసి ఉన్న కేసుల విషయంలోనే తనను అప్రూవర్ గా మారమని ఒత్తిడి తెచ్చారని.. అందుకు తాను నిరాకరించానని.. దైవాన్ని నమ్మిన వ్యక్తిగా నమ్మకద్రోహం, మోసం చేయడం తనకు తెలియదని సాయిరెడ్డి అన్నారు.

Tags:    

Similar News