టీడీపీతో విజయసాయిరెడ్డి సెటిల్మెంట్.. ఇక వారికి మూడినట్లేనా?
వైసీపీ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజకీయ విరామానికి సెలవు ప్రకటిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.;

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను నిజం చేయబోతున్నారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీతో రాజకీయ వైరమే ప్రధాన ఆయుధంగా రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీతో సఖ్యత కోరుకుంటున్నారట.. రాజకీయాలకు విరామం ప్రకటించిన తాను.. ఒట్టు తీసి గట్టుమీద పెట్టాలని, మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారని ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ పునరాగమనానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికార పార్టీతో డీల్ సెట్ చేసుకునేలా విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజకీయ విరామానికి సెలవు ప్రకటిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుని, మళ్లీ రాజ్యసభకు పంపడమే కాకుండా, ఆయన ద్వారా వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తేవాలని ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలంటే ముందుగా కూటమిలోని ప్రధాన పార్టీలను ఒప్పించాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నారట. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయం చర్చించేందుకు ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని చేర్చుకోవడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టొచ్చని.. గత ప్రభుత్వంలోని కొన్ని కీలక కుంభకోణాల విషయంలో ఆధారాలు లభించేలా విజయసాయిరెడ్డి సహకరిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి.. కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ విషయమై నమోదైన కేసు విచారణ సందర్భంగా లిక్కర్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తగిన సమయంలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి చేసిన ప్రకంపనలు పుట్టించింది. ఇలా విజయసాయిరెడ్డి ప్రకటించడం వ్యూహాత్మకంగా భావిస్తున్న పరిశీలకులు.. అప్పుడే టీడీపీతో విజయసాయిరెడ్డి చర్చలు కొనసాగించినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు వేగవంతం కావడం, నిందితులు తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుండటంతో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు.
తన ప్రకటనల ద్వారా ప్రభుత్వంతో సఖ్యత కోరుకుంటున్న విజయసాయిరెడ్డి గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అనేక అంశాల్లో సర్కారుకు సహకరిస్తానని భరోసా ఇస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ కల్పించుకుని కీలకమైన లిక్కర్ స్కాంను సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో విజయసాయిరెడ్డి వ్యవహరించిన వైఖరి కారణంగా టీడీపీ నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రావడం లేదని చెబుతున్నారు. వైసీపీలో ఉండగా జుగుప్సాకరమైన భాషను వాడిన విజయసాయిరెడ్డిని కూటమిలోకి తెస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని టీడీపీ పెద్దలు సందేహిస్తున్నారు. అయితే ముందుగా ఆయన గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసులకు సహకరిస్తే, విజయసాయిరెడ్డిపై ఉన్న అభిప్రాయంలో మార్పు వస్తోందని అంటున్నారు. దీంతో విజయసాయి-టీడీపీ మధ్య చర్చలు కొంత ముందుకు, మరికొంత వెనక్కు వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ పెద్దల ఆసక్తి మేరకు విజయసాయిరెడ్డి ఆ పార్టీ కండువా త్వరలోనే కప్పుకోవచ్చని అంటున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన విజయసాయిరెడ్డి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తన పర్సనల్ ఎక్స్ అకౌంటు ద్వారా వివాదాస్పద, అనుచిత రాతలు రాసేవారని విజయసాయిరెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎప్పుడు ఎవరి అవసరం ఉంటుందో ఊహించలేం కనుక విజయసాయిరెడ్డి సహకారంతో వైసీపీని తీవ్రంగా దెబ్బతీసే రాజకీయ వ్యూహానికి టీడీపీ పదును పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.