వాళ్లకు నేనేంటో చూపిస్తానంటున్న సాయిరెడ్డి... కామెంట్స్ వైరల్!
అవును... వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయసాయిరెడ్డితో ఆమెకు సంబంధం ఉందని.. ఆమె (మాజీ) భర్త మదన్ మోహన్ ఆరోపించడం, దాన్ని చిలువలు పలువలు చేసి ప్రచారం చేశారనే ఆరోపణలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు.
అవును... వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు వైజాగ్ లోని ఓ హోటల్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన స్పందించారు.
ఇందులో భాగంగా... తనపై ఓ వర్గానికి చెందిన మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తోన్న వరుస కథనాలపై నిప్పులు చెరిగారు. ఉద్దేశపూర్వకంగానే వాటిని వండివార్చుతున్నారంటూ మండిపడ్డారు. అసత్య వార్తలను రాసి, తన వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.
ఇదే క్రమంలో ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో అన్ని రకాలుగా తన నిర్ణయాలు ఉండబోతున్నాయని.. ఆ విషయంలో సొంత పార్టీ వాళ్లయిన సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తనపై అసత్యాలను రాసి, ఆధారం లేని వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ కొన్ని న్యూస్ ఛానళ్ల పేర్లను వెల్లడించారు.
కొంతమంది వైసీపీ నేతలు టీడీపీవాళ్లతో కుమ్మక్కయ్యారని.. ఆ వైసీపీ నేతలే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. ఒక ఆదివాసీ స్త్రీతో తనకు సంబంధాలున్నాయని నిరాధారమైన విమర్శలు చేశారని.. ఫలితంగా ఆ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలా సొంతపార్టీ నేతలే సాయిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
చట్టానికి వ్యతిరేకంగా కాకుండా.. చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇదే క్రమంలో... విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు.. ఏం చేస్తాడులే అని తేలిగ్గా తీసుకోవచ్చని ఒక్కసారి పట్టుబట్టితే వెనక్కి తగ్గనని చెప్పారు. ఇదే క్రమంలో వాళ్లకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ సైతం ప్రవేశపెడతానని తెలిపారు.
ఇదే క్రమంలో... ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తానని.. ఇదే సమయంలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ గిరిజన కమిషన్, మానవ హక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానని విజయసాయిరెడ్డి వివరించారు. అదేవిధంగా... టీడీపీకి బాకా ఊదే మీడియాకు వ్యతిరేకంగా త్వరలోనే ఓ ఛానల్ ను స్టార్ట్ చేస్తానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ ఛానల్ మాత్రం న్యూట్రల్ గా ఉంటుందని తెలిపారు.