విజయవాడలో ఈ బోటు జర్నీ మహా కాస్టలీ గురూ!

ఓవైపు కృష్ణా వరద, ఇంకోవైపు బుడమేరు వరద ఉధృతికి విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి.

Update: 2024-09-02 11:51 GMT

విజయవాడ నగరంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువన పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది ఉధృత రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రవహిస్తోంది. ఇంకోవైపు బుడమేరు పొంగి పొర్లుతోంది. ఓవైపు కృష్ణా వరద, ఇంకోవైపు బుడమేరు వరద ఉధృతికి విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి.

గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం విజయవాడలో కురిసింది. దీంతో విజయవాడలోని చాలా ప్రాంతాల్లో నడుం లోతు నీరు ప్రవహిస్తోంది. భవనాల సెల్లార్లలోకి, మొదటి అంతస్తుల్లోకి వరద నీరు చేరింది. విద్యుత్‌ ప్రమాదాలను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్‌ ను ఆపేశారు. దీంతో ప్రజలు చిమ్మచీకటిలో చిక్కుకున్నారు. తాగునీరు, ఆహారం లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. డివిజన్ల వారీగా మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించింది.

కాగా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని పడవల్లో తరలించడానికి ప్రైవేటు వ్యక్తులు భారీగా వసూళ్లు చేస్తున్నారు. సంక్షోభంలోనూ ప్రజ నుంచి భారీగా దండుకుంటున్నారు. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో ఇళ్ల నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి ఒక్కొక్కరి నుంచి రూ.2500 నుంచి రూ.5000 వసూలు చేశారు. ప్రైవేటు బోట్ల యజమానులు ఈ స్థాయిలో ప్రజల నుంచి దండుకుంటున్నా తమను కాపాడటానికి ్రప్రభుత్వం తరఫున బోట్లు ఏమీ రాలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పెద్ద ఎత్తున బోట్లు పంపాలని అధికారులకు విన్నవిస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు వ్యక్తులు కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరానికే రూ.2500 నుంచి రూ.5000 వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస మానవత్వం అనేది లేకుండా వరదల్లోనూ ఇలా చేయడం ఏంటనే విమర్శలు రేగుతున్నాయి.

కాగా ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు దళాలను హెలికాప్టర్‌ ల్లో పంపింది. వీటితోపాటు భారీ ఎత్తున లైఫ్‌ బోట్లను కూడా పంపింది. ప్రభుత్వాధికారులు, మంత్రులు, కూటమి నేతలు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ప్రజలకు ఆహార పదార్థాలు, ఇతరత్రా సాయం అందిస్తున్నారు.

Tags:    

Similar News