టీడీపీకి విజయవాడ నేతల తలనొప్పి.. ఎమ్మెల్సీ పోటీ తీవ్రం
ఏపీ ఎమ్మెల్సీ రేసు ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఖాళీలకు మార్చి 20న ఎన్నికలు జరగనుండగా, ఐదు సీట్లు ఏకగ్రీవయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఏపీ ఎమ్మెల్సీ రేసు ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఖాళీలకు మార్చి 20న ఎన్నికలు జరగనుండగా, ఐదు సీట్లు ఏకగ్రీవయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సులవుగా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఉండటంతో కూటమి నేతలు ఎమ్మెల్సీ అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కూటమిలోని ప్రధాన పార్టీ అయిన టీడీపీలో ఎమ్మెల్సీ పదవుల కోసం నేతలు తీవ్రంగా పైరవీలు చేస్తున్నారు. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణలను చూస్తున్న అధిష్ఠానం ఎవరికి చాన్స్ ఇస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర రాజకీయ రాజధానిగా భావించే విజయవాడలో ఎమ్మెల్సీ పదవుల కోసం ముగ్గురు నేతలు పోటీపడటం అధిష్టానాన్ని ఇరుకున పెడుతోందంటున్నారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. పైగా రాష్ట్ర రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ రాజకీయ ప్రాబల్యం కోసం టీడీపీ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ ప్రాంతంలో ప్రత్యర్థిని చావు దెబ్బతీసిన టీడీపీ భవిష్యత్తులోనూ బలమైన ముద్ర వేయాలని భావిస్తోంది. దీంతో నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి క్రిష్ణా, గుంటూరు జిల్లాల వారికి అవకాశం ఇస్తోంది. అయితే ప్రస్తుతం జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అవకాశాలు పరిమితంగా ఉండటంతో ఎవరికి చాన్స్ ఇవ్వాలనే విషయమై టీడీపీలో తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి ముగ్గురు ప్రధాన నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరినీ కాదనలేని పరిస్థితి ఉండటంతో ఎవరిని సర్దుబాటు చేస్తారనేది ఆసక్తి పెంచుతోంది. గత ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారని భావించిన మాజీ మంత్రి దేవినేని ఉమా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయారు. పార్టీకి లాయల్ గా ఉండే ఉమా మొహమాటం కారణంగా ఒత్తడి తేలేకపోయారంటారు. అందుకే ఆయనకన్నా జూనియర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన టీడీపీ.. ఉమాను పక్కన పెట్టి తగిన సమయంలో అవకాశమిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆయనకు అవకాశం పక్కా అనుకుంటుండగా, విజయవాడకు చెందిన ఇద్దరు కీలక నేతలు రేసులోకి దూసుకురావడంతో రాజకీయం హీటెక్కిస్తోంది.
మాజీ మంత్రి దేవినేని ఉమాకు పోటీగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాక్రిష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాక్రిష్ణ కుటుంబానికి డెల్టా ప్రాంతంలో మంచి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన కుటుంబాన్ని అభిమానించే వేలాది మంది మద్దతు కోసం రాధాక్రిష్ణను జాగ్రత్తగా కాపాడుతూ వస్తోంది టీడీపీ. యువనేత లోకేశ్ ఆయనతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం పార్టీలో రాధాక్రిష్ణ ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపినా, పార్టీ అవకాశం ఇవ్వలేకపోయింది. మరోవైపు ఆయన భార్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సమీప బంధువు. దీంతో ఇరుపార్టీల నుంచి వంగవీటి రాధాక్రిష్ణ పేరుపై పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఉమా లేదా వంగవీటి రాధాకు అవకాశామివ్వాలని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీ ఫైర్ బ్రాండ్ బుద్దా వెంకన్న కూడా తగ్గేదేలే అంటున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బుద్దా వెంకన్న గత ఎన్నికల వరకు ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా వ్యవహరించారు. ఇక పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుచూపని పోరాటం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయం లేదని అంటున్నారు. కానీ, ఒకే ప్రాంతం నుంచి ముగ్గురు పోటీలో ఉండటమే పార్టీకి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ముఖ్యంగా బుద్ధా వెంకన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ కోసం దేనికైనా తెగిస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు బుద్ధా వెంకన్న గేటుకు అడ్డంగా నిల్చొని అల్లరి మూకలను ఎదురొడ్డి పోరాడారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో మాచర్లలో ఆయనపై జరిగిన దాడి అప్పట్లో అందరికీ భయం పుట్టించింది. అలాంటి సందర్భంలో కూడా బుద్దా వెనక్కి తగ్గలేదు. పార్టీ కోసమే పనిచేశారు. ఈ పరిస్థితుల్లో బుద్ధాకు సర్ది చెప్పడమా? ఇప్పుడే అవకాశమిచ్చి మిగిలిన నేతలకు నెక్ట్స్ టర్మ్ వరకు ఆగమని చెప్పడమా? అనేది టీడీపీలో చర్చకు దారితీస్తోంది. మొత్తానికి విజయవాడ నేతలు టీడీపీ అధిష్టానానికి పెద్ద పరీక్ష పెట్టారంటున్నారు. ఈ పరీక్షలో ఎవరికి డిటెన్షన్ వస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.