బెనిఫిట్ షోలు టికెట్ రేట్లపై CM నిర్ణయం సరైనదే
బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ, అధిక టికెట్ ధరలను తగ్గించాలనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సదరు సంఘాలు ప్రకటించాయి.
బెనిఫిట్ షోలు, అధిక టికెట్ రేట్ల కారణంగా థియేటర్లకు వచ్చే ఆడియెన్ గందరగోళానికి గురవుతున్నారని, ఇది ఎగ్జిబిషన్ రంగాన్ని కుదేలయ్యేలా చేస్తోందని తెలంగాణ పిల్మ్ ఛాంబర్ - ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో ప్రకటించాయి. బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ, అధిక టికెట్ ధరలను తగ్గించాలనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సదరు సంఘాలు ప్రకటించాయి.
తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల తగ్గింపు దిశగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్స్ కు ఊపిరి పోసేలా ఉన్నాయని అన్నారు. కీలక నిర్ణయం వెలువరించిన సీఎం రేవంత్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డికి విజయేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసామని చెబుతూ టిక్కెట్లకు అధిక రేట్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు థియేటర్ యజమానులకు ఇబ్బంది ఎదురవుతోందని తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ అన్నారు. టికెట్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలవ్వాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో ఆడియన్స్ కి టికెట్ రేటు ఎంత వుందో కూడా తెలియక అయోమయంలో వున్నారని ఈ సమావేశంలో పలువురు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెజారిటీ సభ్యులు స్వాగతిస్తున్నామని తెలిపారు.
రేట్లు పెరగడం వల్ల పెద్ద సినిమా చూడడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.. దీంతో చిన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకుల వద్ద డబ్బులు ఉండడం లేదని ప్రముఖ ఎగ్జిబిటర్ ఒకరు వ్యాఖ్యానించారు. సగటు ప్రేక్షకుడు కూడా థియేటర్లకు రావాలని ఆయన అన్నారు. హీరోలు థియేటర్స్ కు వెళ్ళొద్దని మంత్రి అనడం సముచితం కాదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఉదయం 8 గంటల తరువాత మాత్రమే షోస్ వెయ్యాలని సినిమాటోగ్రఫీ చట్టం చెబుతోందని ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు గుర్తు చేసారు.