గుడివాడ అమర్నాథ్ నీకు అవసరమా?

ఈ విధంగా జగన్ కు తనకు మధ్య ఆయన కోటరీ అడ్డుగా నిలిచిందని.. ఎవరైనా జగన్ వద్దకు వెళ్లాలంటే ఆ కోటరీ కాళ్లు, చేతులు పట్టుకునో.. ఆర్థికంగా సహకరించో తప్ప వెళ్లలేరని సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.;

Update: 2025-03-13 07:54 GMT

ఒకప్పుడు వైసీపీలోని అత్యంత కీలక నేతల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... ద్వితీయశ్రేణి నాయకులు కొంతమంది తనకు, జగన్ కు మధ్య అభిప్రాయబేధాలు సృష్టించి, ఆయన మనసు విరిచేశారని చెప్పారు.

ఈ సందర్భంగా... మీ చుట్టూ ఉన్న వ్యక్తుల చెప్పుడు మాటలు విని తప్పుదోవ పట్టోద్దు.. మీకు ఐదేళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది.. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలి.. ఎవరు నిజాలు చెబుతున్నారు, మరెవరు అబద్ధాలు చెబుతున్నారో అర్ధం చేసుకుని నిర్ణయాలు తీసుకోండి అని జగన్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు.

ఈ విధంగా జగన్ కు తనకు మధ్య ఆయన కోటరీ అడ్డుగా నిలిచిందని.. ఎవరైనా జగన్ వద్దకు వెళ్లాలంటే ఆ కోటరీ కాళ్లు, చేతులు పట్టుకునో.. ఆర్థికంగా సహకరించో తప్ప వెళ్లలేరని సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే... ఈ వ్యాఖ్యలపై జగన్ ఏమీ స్పందించలేదు.. బహుశా తదుపరి ప్రెస్ మీట్ లో ఏమైనా మాట్లాడొచ్చు!

ఇదే సమయంలో వైసీపీ నుంచి కానీ.. వారి అనుకూల మీడియాగా ముద్రపడిన ఛానల్స్ నుంచి కానీ పెద్దగా రియాక్షన్ వచ్చినట్లు కనిపించలేదని అంటున్నారు. సాయిరెడ్డి ఆరోపణలు ఇప్పటికే వైసీపీలో చాలా మంది నేతలు, కార్యకర్తల నోట్లో నానుతున్న విషయం కావడంతో పెద్దగా రియాక్షన్స్ రాలేదని చెబుతున్నారు. ఈ సమయంలో గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

అవును... తాజాగా జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ జగన్ ను తప్పుదోవ పట్టిస్తుందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మొన్నటి వరకూ కోటరీలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుటుంది? అంటూ సాయిరెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు.

ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుందని.. అయితే, విజయసాయిరెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో తెలియదని చెప్పుకొచ్చారు. గతంలో వైసీపీలో కీలక పదవులు అనుభవించి ఇప్పుడు వైసీపీలో జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. దీంతో... గుడివాడ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు సొంతపార్టీలోనే మొదలైపోవడం గమనార్హం!

వాస్తవానికి జగన్ కు - విజయసాయిరెడ్డికి మధ్య ఏమి జరిగిందనేది బహుశా వీరిద్ధరికి మాత్రమే తెలిసి ఉంటుంది. దీనిపై ఇప్పటికే జగన్ మరో ఆలోచన లేకుండా.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కమిటెడ్ గా ఉండాలి అని, వదిలి వెళ్లకూడదని సాయిరెడ్డి విషయంలో హుందాగా స్పందించి వదిలేశారు. తాజాగా సాయిరెడ్డి కూడా జగన్ పై విమర్శలేమీ గుప్పించలేదు!

అయితే... తాజాగా జగన్ చుట్టూ కోటరీ అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ పెద్దలు ఎవరూ స్పందించలేదు! జగన్ అనుకూల మీడీయాలోనూ భారీ విమర్శలతో కూడిన విశ్లేషణలు తెరపైకి రాలేదు! చాలా మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సాయిరెడ్డి వ్యాఖ్యలను సూచనలను గానూ.. తాము చెప్పాల్సినవి ఆయన చెప్పారన్నట్లుగానే తీసుకున్నారని అంటున్నారు.

ఈ సమయంలో.. గుడివాడ అమర్నాథ్ ఎంటరై ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినదానికీ కానిదానికి తగుదునమ్మా అంటూ స్పందించడం, ప్రతిఫలం ఊహించకుండా విమర్శలు చేయడం వల్ల జగన్ ను ఇరకాటంలో పడేసినట్లే అని చెబుతున్నారు. ప్రతీదానికీ ఇలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తే మొదటికే మోసం వస్తుందనే సృహ కలిగి ఉండాలని సూచిస్తున్నారు!

అధికారంలో ఉన్న సమయంలో కూడా అమర్నాథ్ వైఖరి ఇలానే ఉండేదని చెబుతుంటారు. విషయం తెలియకుండా వ్యాఖ్యానిస్తే జరిగే పరిణామాలపై ఇప్పటికే పొందిన అనుభవాలను గుర్తు తెచ్చుకోవాలని చెబుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో మంత్రిగా పనిచేసి కూడా సుమారు 95,235 ఓట్లతో అత్యంత ఘోరంగా ఓటమి పాలయ్యారు అమర్నాథ్.

ఇలా... పార్టీ అధినేత కానీ, పెద్దలు కానీ స్పందించకుండానే ప్రతీ విషయంలోనూ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం వల్ల.. అవి పార్టీ అభిప్రాయంగానే జనాల్లోకి వెళ్తోన్న పరిస్థితి! ఫలితంగా... జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది! ఈ విషయంలో అమర్నాథ్ కు ఇప్పటికీ జ్ఞానం రాలేదా.. లేక, ఆయనను ఆపడం జగన్ వల్ల కావడం లేదా అనే చర్చా పార్టీలో మొదలైందని అంటున్నారు.

ఏది ఏమైనా... అత్యంత కీలకమైన విషయాలపైనా, కీలకమైన వ్యక్తులకు సంబంధించిన విషయాలపైనా స్పందించేటప్పుడు పార్టీ స్టాండ్ ఏమిటి.. అధినేత ఆలోచన ఏమిటి అనేది తెలుసుకున్న అనంతరం స్పందించాలి తప్ప... తగుదునమ్మా అంటూ ప్రతీ విషయానికీ మైకుల ముందుకు వస్తే మాడు పగిలిపోయే ప్రమాదం లేకపోలేదనేది పరిశీలకుల మాటగా ఉంది.

మరి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయం ఇప్పటికైనా తెలుసుకుంటారా..? ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆయనకు పలు సూచనలు సలహాలు ఇస్తుందా..? లేక, ఈ నాలుగేళ్లు ఇలానే వదిలేసి విపక్షాలతో జరగాల్సిన డ్యామేజీ అంతా ఈయనతోనే చేయించేస్తుందా..? అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News