షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ ఇంట్రెస్టింగ్ !
రాజకీయాలు వద్దు వైసీపీ అసలే వద్దు ఆ పార్టీ ఇచ్చిన ఎంపీ పదవి అంతకంటే వద్దు అని అంటూ విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు.
రాజకీయాలు వద్దు వైసీపీ అసలే వద్దు ఆ పార్టీ ఇచ్చిన ఎంపీ పదవి అంతకంటే వద్దు అని అంటూ విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు. ఆయన వైసీపీని వీడి వారం రోజులు అవుతోంది. రాజకీయ సన్యాసం ప్రకటన కూడా చేశారు. అయినా ఇంకా ఆయన చుట్టూ రాజకీయం తిరుగుతూనే ఉంది.
ఆయన తాజాగా వైసీపీ అధినేత జగన్ సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కి వెళ్ళి మరీ షర్మిలతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు అని అంటున్నారు. ఈ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారు అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
అన్న జగన్ కి పోటీగా ఎదురు నిలిచి గత ఎన్నికల్లో ప్రచారం చేశారు షర్మిల. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి బయటకు రావడం మీద కూడా ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఇకనైనా వాస్తవాలు చెప్పాలని ఆమె కోరడం విశేషం.
అంతే కాదు జగన్ తన దగ్గర ఎవరినీ ఉంచుకోలేకపోతున్నారని ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వారు పార్టీని వీడడమే ఇందుకు నిదర్శనం అని ఆమె అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ కావడంతో అసలు ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే సాగుతోంది.
అయితే వైఎస్సార్ కుటుంబానికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితులు అన్నది తెలిసిందే. ఆ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఆయనకు ఉంది. దాంతో ఆయన షర్మిలను కలసి ఉంటారని అంటున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ ఏపీ రాజకీయాల మీద కూడా చర్చించుకున్నారని అంటున్నారు.
వైసీపీలో నంబర్ టూగా నిన్నటిదాకా మెలిగిన విజయసాయిరెడ్డికి పార్టీలో జరిగేవి అన్నీ తెలుసు. అలాగే ఆయన ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకంగా ఉంటూ వచ్చారు. దాంతో పాటు వైసీపీలో ఒకనాడు షర్మిల విజయసాయిరెడ్డి ఇద్దరూ జగన్ తో కలసి ఉన్న వారే. ఒకరు రక్త సంబంధం అయితే మరొకరు స్నేహబంధం. అలాంటి వారు పార్టీని వీడిపోవడంతోనే వైసీపీ లో చర్చ సాగుతోంది. ఇపుడు ఈ ఇద్దరూ కలవడంతో అన్ని విషయాలూ చర్చకు వచ్చాయని అంటున్నారు.
ఏపీలో వైసీపీ పతనం రాజకీయంగా జరిగితేనే కాంగ్రెస్ కి ఊపిరి వస్తుంది. కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వైఎస్సార్ కుమార్తెకు పార్టీ పగ్గాలు అందించింది. దాంతో వైసీపీలో వ్యూహకర్తగా పనిచేసి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి షర్మిల భేటీ తరువాత ఆమె మరింతగా వైసీపీ మీద తన విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.