విజయసాయిరెడ్డికే సీటు ...కాకపోతే ?
వైసీపీలో ఒకనాటి జగన్ నీడ అయిన విజయసాయిరెడ్డి ఇపుడు రాజకీయంగా సన్యాసం తీసుకున్నారు.;

వైసీపీలో ఒకనాటి జగన్ నీడ అయిన విజయసాయిరెడ్డి ఇపుడు రాజకీయంగా సన్యాసం తీసుకున్నారు. అయితే ఆ రాజకీయ సన్యాసం నుంచి ఆయన తొందరలోనే బయటకు వస్తారని చర్చ సాగుతోంది. ఆయన కోసమే ఏపీలో రాజ్యసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోందా అన్నది కూడా ఉంది. జనవరి 25న విజయసాయిరెడ్డి తనకు వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత అదే నెల 30న వైసీపీకి రిజైన్ చేశారు. ఇక తన రాజకీయ జీవితం పరిసమాప్తం అన్నారు. వ్యవసాయమే తనకు ఇక సాయం అని కూడా చెప్పారు.
అంతా బాగానే ఉంది అనుకునేంతలో ఆయన గత నెలలో మీడియా ముందుకు వచ్చి ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం లో ఉన్నాను అని ట్విస్ట్ ఇచ్చారు. ఇపుడు చూస్తే ఏపీలో ఆయన వల్ల ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఉప ఎన్నికల జరగనుంది. అయితే ఆ సీటు ఎవరికి దక్కుతుంది అన్నది చర్చగా మరోమారు ముందుకు వచ్చింది.
తెలుగుదేశం పార్టీ ఆ సీటుని తీసుకోవడానికి ఆసక్తిగానే ఉన్నప్పటికీ రాజధాని పోలవరం సహా ఏపీ విషయంలో అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వం సాయం అవసరం అని భావిస్తోంది. దాంతో బీజేపీ పెద్దలు కోరుకుంటే వదులుకోవడానికి సిద్ధమని అంటున్నారు ఇక జనసేనకు ఈ సీటు మీద ఆశలు ఉన్నా కూడా బీజేపీ పెద్దలే కోరుకుంటే ఆ పార్టీ కూడా సరేనని అంటుందని చెబుతున్నారు.
అంటే ఈ సీటు కచ్చితంగా బీజేపీకే వెళ్తుంది అని చెబుతున్నారు. మరి బీజేపీలో ఎవరికి ఇస్తారు అన్నదే చర్చగా ఉంది. విజయసాయిరెడ్డికే ఈ సీటు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళడానికే ఈ విధంగా జనవరి లో తన ఎంపీ సీటుకు రాజీనామా చేశారు అని అంటున్నారు. ఏపీలో బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య చేసినట్లుగా వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళి మరీ తన సీటుని నిలబెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో అన్నీ మాట్లాడుకునే ఈ విధంగా చేశారు అని అంటున్నారు.
అయితే విజయసాయిరెడ్డికి ఎంపీ సీటు అంటే ఏపీలో కూటమి పెద్దన్న టీడీపీ ఒప్పుకోవాలి. మరి ఆ పార్టీ ఎంతమేరకు అంగీకరిస్తుంది అన్నది చర్చగా ఉంది. ఇక సిట్ మరోసారి విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. అయితే ఆయనకు సాక్షిగానే లిక్కర్ స్కాం విషయంలో పిలిచింది అని అంటున్నారు. ఆయన ఈ నెల 18న హాజరు అవుతున్నారు. మరి ఆయన సాక్షిగా ఈ కేసులో విచారణకు హాజరై ఏమి చెప్పబోతున్నారు అన్న దానిని బట్టి కూడా ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ ఏంటో తెలుస్తుంది అని అంటున్నారు.
ఏపీలో టీడీపీ అధినేత తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని పార్టీ పరంగానే రాజకీయంగానే తాను అప్పట్లో విమర్శలు చేశాను అని రాజీనామా చేసిన సందర్భంలోనే విజయసాయిరెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చేశారు. అయితే అది ఆయన ఆచరణలో కూడా రుజువు చేసుకోవాల్సి ఉంటుందా అన్న చర్చ ఉంది. అలా పరిణామాలు అన్నీ ఒక కొలిక్కి వస్తే కనుక విజయసాయిరెడ్డి ఏపీ నుంచి బీజేపీ కోటాలో టీడీపీ మద్దతుతో పెద్దల సభలో అడుగుపెడతారు అని అంటున్నారు.
ఒకవేళ ఈ ఈక్వేషన్స్ లో ఏమైనా తేడాలు వస్తే కనుక విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి వేరే వారికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. అది కూడా బీజేపీలోని వారికే అని చెబుతున్నారు. ఆ చాన్స్ విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకే అని చెబుతున్నారు. ఆయన కూడా బీజేపీకి బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడని ఆయనకు సీటు ఇవ్వడం ద్వారా ఏపీలో పార్టీ వాయిస్ ని బలంగా వినిపించాలన్న ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ మనసులో ఏముందో ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించవచ్చు అని అంటున్నారు. ఆయన విదేశీ టూర్ కోసం వారం పాటు వెళ్తున్నారు. ఆయన తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర పెద్దలతో బాబు భేటీ అయి ఏపీలో రాజ్యసభ అభ్యర్థి ఎవరు అన్నదాని మీద చర్చిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ రాజ్యసభ సీటు మూడొంతులు విజయసాయిరెడ్డికే అని అంటున్నారు. ఆయన కాకపోతే మాత్రమే జీవీఎల్ పేరు తెర మీదకు రావచ్చు అని చెబుతున్నారు.