రెజ్లర్ కంటే రైతు బిడ్డను.. వినేశ్ ఫొగట్ ఇక రాజకీయాల్లోకి?

రైతు కుటుంబంలో పుట్టినందుకు అదృష్టవంతురాలనని.. మీ బిడ్డ మీతోనే ఉందని చెప్పేందుకు వచ్చానని వ్యాఖ్యానించారు.

Update: 2024-08-31 13:30 GMT

రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా గత ఏడాది ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సహచర రెజ్లర్లతో కలిసి సాగించిన పోరాటం దేశం అంతటినీ చలింపజేసింది. అనేక రూపాల్లో వారు ఉద్యమించి తీరు అందరినీ కదిలించింది.

ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో అదే పట్టుతో రెజ్లింగ్ రింగ్ లో వినేశ్ సాగించిన సమరం ఆకట్టుకుంది. అయితే, ఆమెకు త్రుటిలో ఒలింపిక్ పతకం మిస్ అవడం అందరినీ బాధించింది. ఎంతో కష్టపడి ఫైనల్ కు చేరిన వినేశ్ కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకానికి దూరం కావడం గుండెలను పిండేసింది. దీంతోనే వినేశ్ కూడా రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. స్వదేశంలో మాత్రం ఆమెకు ఘన స్వాగతం దక్కింది.

మళ్లీ ఇప్పుడు వినేశ్ వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరతారంటా ఆమెపై ప్రచారం జరుగుతోంది. అందులోనూ హరియాణలో త్వరలో ఎన్నికలు ఉండడంతో అందరూ దీనిపై మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినేశ్ శనివారం అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద రైతులు సాగిస్తున్న ఆందోళనలో పాల్గొని మద్దతు పలికారు.

రైతులకు మద్దతు.. మోదీకి వ్యతిరేకం అంబాలా వద్ద రైతులు చేపట్టిన ఆందోళన 200వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినేశ్ సంఘీభావం ప్రకటించారు. రైతుల ఆందోళనలో పాల్గొనడం అంటే మోదీకి వ్యతిరేకంగా వెళ్లడమే. ఇక వినేశ్ మాట్లాడుతూ తాను రెజ్లర్ కంటే రైతు బిడ్డనేనని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ లో చేరే అంశంపై మాత్రం మాట్లాడలేదు. రైతు కుటుంబంలో పుట్టినందుకు అదృష్టవంతురాలనని.. మీ బిడ్డ మీతోనే ఉందని చెప్పేందుకు వచ్చానని వ్యాఖ్యానించారు. మన హక్కుల కోసం మనమే నిలబడాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఇన్నాళ్లుగా రైతుల డిమాండ్లను వినకపోవడం బాధాకరమని వినేశ్ పేర్కొన్నారు.

హరియాణా వ్యవసాయ రాష్ట్రమే కాదు.. క్రీడాకారుల రాష్ట్రం కూడా. వినేశ్ తో పాటు మను భాకర్, నీరజ్ చోప్రా, సరబ్ జ్యోత్, అమన్ నెహ్రావత్ వీరంతా హరియాణా వారే. ఇలాంటి నేపథ్యంలో క్రీడాకారుల ప్రభావం ఎన్నికలపై చాలా ఉంటుంది. అందుకని వినేశ్ రాజకీయాల్లోకి చేరడం ఖాయం అనిపిస్తోంది.

Tags:    

Similar News