విశాఖ స్వామి-బీజేపీ-చంద్రబాబు: ఈ విషయం తెలుసా?
మొత్తంగా వైసీపీ హయాంలో విశాఖ స్వామి చక్రం బాగానే తిప్పారు. దీనికి ప్రతిఫలంగా వైసీపీ హయాంలో జగన్.. ఆ స్వామి పీఠానికి విశాఖలోనే 15 ఎకరాలను కేటాయించారు.
వైసీపీ అధికారంలో ఉండగా.. అంతా తానై వ్యవహరించిన విశాఖకు చెందిన శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వ్యవహారం.. ఏపీలో ఆసక్తిగా మారింది. వైసీపీని 2019లో అధికారంలోకి తీసు కువచ్చేందుకు స్వామి యాగాలు, యజ్ఞాలు చేశారు. జగన్‌కు ఎప్పుడూ అందుబాటులో కూడా ఈ స్వామి ఉన్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఏం జరిగినా.. మౌనం పాటించారు. హిందూ సంఘాల నుంచి డిమాండ్లు వచ్చినా.. పట్టనట్టే వ్యవహరించారు.
మొత్తంగా వైసీపీ హయాంలో విశాఖ స్వామి చక్రం బాగానే తిప్పారు. దీనికి ప్రతిఫలంగా వైసీపీ హయాంలో జగన్.. ఆ స్వామి పీఠానికి విశాఖలోనే 15 ఎకరాలను కేటాయించారు. ఇది మార్కెట్ విలువ ప్రకారం.. 100 కోట్ల వరకు ఉంటుందని అప్పట్లోనే లెక్కలు బయట పడ్డాయి. పోనీ.. ప్రభుత్వ లెక్కల ప్రకారం వేసుకు న్నా..(ఎకరా 2 కోట్లు) 60 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. కానీ, జగన్ ప్రభుత్వం స్వామిపై ప్రేమతో ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయించింది. ఇది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది.
ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకానికి వచ్చే భీమిలి సముద్ర ఒడ్డున ఈ స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ వేద పాఠశాల, ఉచిత ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని చెప్పారు. కానీ, అలా జరగలేదు. ఇదే విషయంపై తాజాగా స్థానిక ఎమ్మెల్యేలు కొందరు సర్కారుకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయాన్ని తిరగదోడిన సర్కారు.. 60 కోట్ల రూపాయలను కట్టించుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇది జరిగి నెల రోజులు అయిపోయింది. కానీ, అధికారులు మాత్రం అడుగు ముందుకు వేయలేదు.
ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది. బీజేపీతో ఉన్న సత్సంబంధాలతో స్వామి అటు నుంచి నరుక్కు వచ్చారని... దీంతో ఫైలును ముందుకు జరగనీయకుండా.. బీజేపీకి చెందిన కొందరు నాయకులు అడ్డు పడుతున్నారన్నది చర్చ. తాజాగా ఈ విషయం చంద్రబాబు దృష్టికి కూడా వచ్చింది. పైకి ఆయన అధికారులను తిట్టిపోసినా.. ఇక, బీజేపీ కోర్టులోకి ఈ విషయం చేరే సరికి.. ''మీరే ఏదో ఒకటి తేల్చండి'' అని ముక్తాయించారు. ఇక, ఇప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు..? అన్నది ప్రశ్న. మొత్తానికి.. బీజేపీ చొరవతో స్వామి బయటకు పడిపోయారనే గుసగుస మాత్రం వినిపిస్తోంది.