విశాఖ ఎంపీ సీటుని ఈసారి గెలిచి తీరాలని టీడీపీ భావిస్తోంది. అందుకోసం బీజేపీ జాతీయ నాయకత్వం ఎంతగా డిమాండ్ పెట్టినా కూడా విశాఖ సీటుని అసలు వదులుకోలేదు. గతంలో చేసిన తప్పులను కూడా ఈసారి చేయకుండా బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కి ముందే ప్రచారం చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ మీదట టికెట్ ని అఫీషియల్ గా ప్రకటించింది.
దాంతో శ్రీభరత్ ప్రచారంలో చూస్తే చాలా ముందుగానే ఉన్నారు. అదే విధంగా చూస్తే విశాఖ ఎంపీ సీటులో శ్రీ భరత్ 2019లో చివరి దాకా పోటీ ఇచ్చారు. కేవలం నాలుగు వేల స్వల్ప తేడాతోనే ఓటమిని చూసారు. దానికి కారణం మాజీ జేడీ లక్ష్మీనారాయణ భారీగా ఓట్లను చీల్చడమే.
ఈసారి కూడా తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని మాజీ జేడీ ఈ మధ్యదాకా ప్రకటనలు చేసినా ఏమైందో ఏమో కానీ ఆయన చివరి నిముషంలో మనసు మార్చుకున్నారు. ఆయన విశాఖ నార్త్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అంటే ఆయన అసెంబ్లీకి పరిమితం అవుతున్నారు అన్న మాట.
ఇది కూడా టీడీపీకి కలసివస్తున్న అంశంగా ఉంది. అయితే విశాఖ ఎంపీ సీటుకు వైసీపీ వ్యూహాత్మకంగా బీసీ మహిళా లోకల్ లీడర్ అయిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మిని పోటీకి దించింది. విశాఖ నిండా బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో పాటు తూర్పు కాపులు ఉన్నారు.
ఇదే ఇపుడు టీడీపీని కలవరపెడుతోంది. దాంతో పాటుగా కూటమి పొత్తులతో విశాఖ పార్లమెంట్ పరిధిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. విశాఖ సౌత్ సీటుని జనసేనకు ఇచ్చారు. అక్కడ సరైన అభ్యర్ధిని పెట్టకపోతే ట్రబుల్స్ వస్తాయి. అక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది.
అలాగే విశాఖ నార్త్ లో కూడా కేకే రాజుకు జనంలో సానుభూతి ఉంది. ఆయన వైసీపీ తరఫున 2019లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలు అయ్యారు. దాంతో ఈసారి ఆయనను గెలిపిస్తామని జానలు అంటున్నారు. ఇక్కడ సీటుని బీజేపీకి ఇచ్చారు. దాంతో నార్త్ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్ధికి ఓట్లు ఎంతమేరకు వస్తాయన్నది కూడా చూడాల్సి ఉంది.
విశాఖ తూర్పు విశాఖ పశ్చిమంలో మరో సమస్య ఉంది. ఇక్కడ సిట్టింగులకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే ప్రతీ సారీ వారికే టికెట్లు ఇవ్వడం పట్ల పార్టీలో అసంతృప్తి ఉంది. అలాగే జనంలో కూడా యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి వైసీపీ చూస్తోంది. ఇక్కడా హోరాహోరీ పోరు సాగుతోంది. దాంతో టీడీపీకి ఈ రెండు సీట్ల నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఎంత మేరకు ఓట్లు వస్తాయన్నది చూడాలి.
ఎస్ కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారికి టికెట్ ఇచ్చారు. దంతో గొంప క్రిష్ణ ఇక్కడ నిరసన వినిపిస్తున్నారు. ఇది కూడా ఎంపీ సీటుకు చేటు తెస్తుందా అన్నది ఆలోచిస్తున్నారు. భీమిలీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీకి దిగడం ఊరట అంటున్నారు. ఇక్కడ కనుక మంచి మెజారిటీ తెస్తే విశాఖ ఎంపీ సీటుని టీడీపీ దక్కించుకోవచ్చు అంటున్నారు. అయితే వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు అని అంటున్నారు.
ఇక గాజువాకలో మాత్రం టీడీపీకి అనుకూలమైన పరిస్థితి ఉంది. అక్కడ వైసీపీ వర్గ పోరు టీడీపీకి హెల్ప్ గా మారుతోంది అని అంటున్నారు. అదే విధంగా టీడీపీ అభ్యర్ధి బలంగా ఉండడం కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక సామాజిక సమీకరణలలో వైసీపీ ముందు ఉంది. తూర్పు కాపులు కనుక ఒక్కటిగా నిలబడితే మాత్రం విశాఖ ఎంపీ సీటులో వైసీపీ ముందుండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సీటు రెండు పార్టీలకు టఫ్ ఫైట్ గానే ఉంటుందని ఒక అంచనా ఉంది.