అన్ని కళ్ళూ విశాఖ మీదనే...వాట్స్ ద మ్యాటర్...?
విశాఖ ఎంపీ సీటు కూడా ఇదే టైం లో హాటెస్ట్ అండ్ స్వీటెస్ట్ గా మారిపోయింది. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది క్యూలో ఉన్నారు.
విశాఖ ఏపీలో మెగా సిటీ అని అందరికీ తెలిసిందే. దాంతో పాటు ఇపుడు కూల్ సిటీ విశాఖలో రాజకీయ కార్యకలాపాలు కూడ ఎక్కువ అయ్యాయి. విశాఖ కేంద్రంగా వైసీపీ పావులు కదుపుతూంటే విపక్షాలు కూడా అదే రూట్ లోకి వస్తున్నాయి. దాంతో అనధికార రాజధానిగా విశాఖ తన పేరును నమోదు చేసుకుంటోంది.
విశాఖ ఎంపీ సీటు కూడా ఇదే టైం లో హాటెస్ట్ అండ్ స్వీటెస్ట్ గా మారిపోయింది. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది క్యూలో ఉన్నారు. విశాఖ నుంచి ఎంపీగా బీజేపీ నుంచి ఫస్ట్ చాయిస్ గా దగ్గుబాటి పురంధేశ్వరి రంగంలోకి వచ్చారు. ఆమె విశాఖ ఎంపీగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అలా కేంద్రంలో మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.
దాంతో లక్కీ సీటుగా ఆమె విశాఖను భావిస్తున్నారు. పైగా ఏపీలో బీజేపీకి అంతో ఇంతో పట్టున్న సీటు ఇది. పొత్తులు కనుక టీడీపీతో ఉంటే సునాయాసంగా ఈ సీటుని గెలుచుకోవచ్చు అన్నది ఆమె ఆలోచన అని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటు 2014లో బీజేపీకి వదిలేసిన టీడీపీకి 2019లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడింది.
బాలయ్య రెండవ అల్లుడు శ్రీ భరత్ ఈ సీటు నుంచి పోటీ చేశారు అప్పట్లో. దాంతో ఈసారి ఆయన కచ్చితంగా పోటీకి తయారు అని అంటున్నారు. ఆయన అసెంబ్లీకి వద్దామనుకుంటే టీడీపీ హై కమాండ్ అంత సులువుగా ఓకే చేయదు అని అంటున్నారు. లోకేష్ ఆయన తోడల్లుడే. దాంతో ఇద్దరు అల్లుళ్ల మధ్య పార్టీలో అధికార కేంద్రాలు తయారవుతాయని భావన ఉంది.
సో శ్రీ భరత్ కి విశాఖ ఎంపీ సీటు ఫిక్స్ చేస్తారని అంటున్నారు. ఇక రాజ్యసభ మెంబర్ వి విజయసాయిరెడ్డి అల్లుడు కూడా విశాఖ సీటు నుంచి పోటీకి దిగుతారు వైసీపీలో ఒక చర్చ అయితే నడుస్తోంది. విజయసాయిరెడ్డి ఆరేళ్ళ పాటు విశాఖ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నడిపారు. అందువల్ల ఆ ట్రాక్ రికార్డు తో అల్లుడు రంగ ప్రవేశం చేస్తారు అని అంటున్నారు.
మరో వైపు సిట్టింగ్ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా రేసులో కచ్చితంగా ఉంటారని అంటున్నారు. ఇక పొత్తులు ఉంటే కనుక జనసేన కూడా ఈ సీటు మీద మక్కువ చూపిస్తుంది అని అంటున్నారు. ఆ పార్టీ నుంచి విశాఖ సీనియర్ లీడర్ 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీ గా పోటీ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ బరిలోకి దిగుతారు అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు రెండు లక్షల ఎనభై వేల ఓట్లు విశాఖ ఎంపీ సీటులో ఒంటరిగా పోటీ చేస్తే వచ్చాయి. అందువల్ల పొత్తులు ఉంటే తామే గ్యారంటీగా గెలుస్తామని కూడా ఆ పార్టీ భావిస్తోంది.
వీటన్నిటి కంటే ఇంటరెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేస్తారు అని. ఆయన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కనుక ఏర్పడితే మంత్రిగా పనిచేసేందుకు ఈ గెలుపు ఉపయోగపడుతుంది అని లెక్కలేసుకుని మరీ పవన్ కళ్యాణ్ విశాఖను టార్గెట్ చేశారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన తాను గెలిచి తీరుతాను అని నమ్మకంగా ఉన్నారు. ఇలా చాలా మంది కన్ను విశాఖ ఎంపీ సీటు మీద ఉంది అని అంటున్నరు. ఈసారి విశాఖ ఎంపీగా ప్రధాన పార్టీలు ఎవరిని బరిలోకి దించుతాయో చూడాల్సి ఉంది.