కూటమిలో విష్ణు కుంపటి.. విషయం ఏంటంటే.. !
చిన్నపాటి విభేదాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నా.. పైస్థాయిలో మాత్రం మూడు పార్టీలు కలిసి కట్టుగానేఉన్నాయి.
ఏపీ కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలూ దాదాపు ఒక్కటే మాట అన్నట్టుగా ఉన్నాయి. చిన్నపాటి విభేదాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నా.. పైస్థాయిలో మాత్రం మూడు పార్టీలు కలిసి కట్టుగానేఉన్నాయి. ఈ విషయంలో బేధాభిప్రాయాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి కీలక సమయంలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు.. కూటమిలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం కూటమి సర్కారులోని నాయకులు, పార్టీలు కూడా.. పుష్ప-2 వ్యవహారంపై మౌనంగా ఉన్నాయి.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఒక్క పల్లా శ్రీనివాసరావు మాత్రమే ఈ విషయంపై స్పందించారు. ఆయన కూడా ఆచి తూచి స్పందించారు. ప్రీమియర్ షోలకు ఏపీలో నిషేధం లేదని చెప్పారు. ఈవిషయంలో అందరూ ఆచి తూచి వ్యవహరిస్తే.. బాగుంటుందని చెప్పుకొచ్చారు. అయితే.. దీనికి భిన్నంగా బీజేపీ నాయకుడు.. ఎమ్మెల్యే రాజుగారు మాత్రం ఫైర్ అయ్యారు. పుష్ప-2 విషయంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విమర్శలే చేశారు. అసలు ప్రీమియర్ షోలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా రాయితీలు, టికెట్ల ధరలపైనా విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం.. తెలంగా ణలోని బీజేపీ సహా.. ఏపీ బీజేపీ నాయకులకు కూడా ఇబ్బందిగానే మారింది. వాస్తవానికి ఏపీ బీజేపీ ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ బీజేపీ మాత్రం పుష్ప-2కు పూర్తి మద్దతు ప్రకటించింది. రేవతి మృతిని ఖండిస్తున్నా.. ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడాన్ని అక్కడి నేతలు.. సమర్థిస్తున్నారు. అదేవిధంగా ప్రీమియర్ షోల విషయంలోనూ..తమ స్టాండు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో విష్ణు రాజేసిన.. కుంపటి కూటమి పార్టీల్లో కలకలం రేపుతోంది. అయితే.. ఈ వ్యాఖ్యల విష యంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఎలాంటి కామెంటు చేయలేదు. విష్ణు వ్యాఖ్యలు పార్టీ తరఫున చేశారా? లేక.. ఆయన వ్యక్తిగతమా? అన్న విషయంలోనూ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఇది మరింత ఇబ్బందిగానే మారింది. అయితే.. విష్ణు చేసిన వ్యాఖ్యలపై స్పందించవద్దని.. టీడీపీ, జనసేన అధినేతల నుంచి పార్టీ కేడర్‌కు సమాచారం వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.