బీజేపీలో వైసీపీ విలీనం...బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు !

ఈ నేపధ్యంలో విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఒక బాంబు లాంటి వార్తనే పేల్చారు.

Update: 2024-08-19 16:30 GMT

ఏపీలో వైసీపీ రాజకీయ దారి ఏమిటో తెలియడం లేదు. దారుణాతి దారుణంగా ఓటమి పాలు అయింది. అదే సమయంలో పార్టీ మొత్తం డీ మోరలైజ్ అయింది. ఏపీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి బలంగా ఉంది. ఒక జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలు కలసి ఏర్పాటైన ఏపీలో ప్రభుత్వం పూర్తి స్ట్రాంగ్ గా ఉంది.

విపక్షంలో చూస్తే మరే పార్టీతోనూ వైసీపీకి దగ్గరతనం లేదు. ఒకటి ఒంటరి అంకెలా మిగిలిపోయిన వైసీపీ గురించి ఎన్నెన్నో ఊహాగానాలు ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. వైసీపీ ఇక మీదట సొంతంగా ఎదిగే చాన్స్ లేదని ఆ పార్టీ ఏదో ఒక పార్టీలో విలీనం కావడమే మిగిలింది అని కూడా ప్రచారం చేస్తున్న వారు ఉన్నారు. ఈ నేపధ్యంలో విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఒక బాంబు లాంటి వార్తనే పేల్చారు.

బీజేపీతో వైసీపీ విలీనాన్ని తాము ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసారు. బీజేపీకి ఆ అవసరం కూడాలేదు అని కుండబద్దలు కొట్టారు. పైగా వైసీపీకి ఏపీలో ఏమీ లేదని తేల్చేశారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కనీసం అయిదు ఎమ్మెల్యే సీట్లు కూడా రావని జోస్యం సైతం చెప్పారు.

అక్కడితో ఆగకుండా వైసీపీ అధినేత జగన్ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నపుడు దోచుకున్నదంతా బెంగళూరు ప్యాలెస్ లో పెట్టారని, అక్కడికి ఈడీ ఇంకం టాక్స్ అధికారులు వెళ్ళి దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. అంతే కాదు జగన్ విజయవాడ టూ బెంగళూరుకు విమానంలో ప్రయాణం చేస్తున్నపుడు కూడా తనిఖీలు చేయాల్సిందే అని రాజు మరో కొత్త డిమాండ్ పెట్టారు.

నిజానికి ఇలాంటి డిమాండ్లు టీడీపీ కూడా పెట్టలేదు, రాజు గారే ఇలా అంటున్నారు అంటే జగన్ మీద ఆయనకు ఏ రేంజిలో ఆగ్రహం ఉందో అని అంతా అంటున్నారు. అంతే కాదు బీజేపీతో వైసీపీ విలీనం అన్న కొత్త వార్తను కూడా ఆయనే మీడియాకు అందించారు. అసలు అలా జరుగుతోందా ఆ ప్రతిపాదన ఏదైనా ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు అంటే వైసీపీ ఓటు బ్యాంక్ వేరు బీజేపీ ఓటు బ్యాంక్ వేరు. రెండు పార్టీల ఫిలాసఫీ కూడా వేరు. అలాంటిది బీజేపీలో వైసీపీ విలీనం అన్న ప్రశ్న ఎలా తలెత్తుతుంది అని అంటున్న వారూ ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని అంటున్న వర్గాలూ ఉన్నాయి.

ఎపుడు ఏమి జరుగుతుందో పాలిటిక్స్ లో ఎవరికీ తెలియదు, ఏమో బీజేపీ వైసీపీ విలీనం అయినా కావచ్చు అన్న వారూ ఉన్నారు. ఏపీ బీజేపీ శాసనసభా పక్ష నేతగా రాజు ఉన్నారు. ఆయనకు ఈ విలీనం గురించి ఏమైనా వార్తలు అంది ఉండవచ్చు అని అందుకే ఆయన మీడియా ముందే కుండ బద్ధలు కొట్టారని తన వ్యతిరేకతను సైతం వ్యక్తం చేశారు అని అంటున్నారు.

మొత్తం మీద వైసీపీ అన్నది ఏపీలో లెక్కలోకి తీసుకోవాల్సిన పార్టీ కాదు అన్నట్లుగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతున్నారు. మరి ఆయన మాటల వెనక ఏముందో, ఆయన చెబుతున్నట్లుగా విలీనం వార్తలే నిజమే అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు పుట్టడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News