బీటెక్ రవి సంచలనం: దస్తగిరి బ్యారక్ లోకి అతడు వెళ్లటం చూశా

జైల్లో ఉన్న దస్తగిరిని జైలుకు వెళ్లి మరీ బెదిరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.

Update: 2025-02-11 05:06 GMT

పెను సంచనలంగా మారిన వైఎస్ వివేకా దారుణ హత్యకేసులో నిందితుడు ఆ తర్వాత రోజుల్లో అప్రూవర్ గా మారిన దస్తగిరిని జైల్లో అతడు ఉన్న బ్యారెక్ లోకి మరో నిందితుడి కుమారుడు వెళ్లి రావటాన్ని తాను చూసినట్లుగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు. ఆ సమయంలో తాను కూడా జైల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కడప జైల్లో ఉన్న తాను తన ఎదుటి బ్యారెక్ లోనే దస్తగిరి ఉండేవాడని పేర్కొన్నారు.

జైల్లో ఉన్న దస్తగిరిని జైలుకు వెళ్లి మరీ బెదిరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి. ఈ బీటెక్ రవి రియాక్టు అవుతూ.. దస్తగిరి బ్యారెక్ లోకి చైతన్య రెడ్డి వెళ్లి రావటాన్ని తాను చూసినట్లుగా పేర్కొన్నారు. 2023 నవంబరు 28న దస్తగిరి ఉన్న బ్యారక్ లోని చైతన్యరెడ్డి వెళ్లాడన్న బీటెక్ రవి.. ఇలా వెళ్లటం మంచి పద్దతి కాదని అప్పటి జైలు అధికారులకు తాను చెప్పినట్లుగా వెల్లడించారు. అయితే.. ఆ రోజు తన మాటల్ని జైలు అధికారులు పట్టించుకోలేదన్నారు.

దస్తగిరి ఉన్న ఎస్ఎస్ఆర్ బ్యారక్ ఎదురుగానే తాను ఉన్నానని.. తాను బెయిల్ మీద జైలు నుంచి రావటానికి ఒక రోజు ముందే చైతన్యరెడ్డి బ్యారక్ లోకి వెళ్లాడన్నారు. ఎయిర్ పోర్టులో పోలీసుల్ని బెదిరించారన్న అభియోగం మీద బీటెక్ రవిపై కేసు నమోదైంది. అతడ్ని కడప జైల్లో ఉంచారు. 2023 నవంబరు 14 నుంచి 29 వరకు జైల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన బీటెక్ రవి.. ‘‘దస్తగిరి బ్యారక్ లోకి వెళ్లిన చైతన్య రెడ్డి అక్కడే చాలాసేపు ఉన్నారు. లోపల వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే.. ఫుటేజ్ అందుబాటులో లేదని చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. దస్తగిరిని చైతన్య రెడ్డి కలిసి వచ్చిన తర్వాత ఎవరినీ కలవనీయలేదు. తనను చైతన్య రెడ్డి కలిసిన విషయాన్ని ఇంకెవరికి చెప్పకూడదన్న ఉద్దేశంతోనే దస్తగిరితో ఎవరిని కలవనివ్వకుండా ఉండి ఉంటారు’’ అని పేర్కొన్నారు. బీటెక్ రవి మాటలతో చైతన్యరెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News