వివేకా వాచ్ మెన్ రంగన్న మృతి.. అనుమానంతో పోలీసులకు భార్య ఫిర్యాదు!

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న (70) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.;

Update: 2025-03-06 07:04 GMT

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న (70) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

కొంతకాలంగా ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రంగన్న రెండు వారాల క్రితం కిందపడిపోయారు. దాంతో ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే ఆయనను, రక్షణగా ఉన్న కానిస్టేబుల్ సహాయంతో కడప రిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో సాయంత్రం వైద్యులు ఆయన మరణించినట్లు వెల్లడించారు.

పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షి కావడంతో అధికారులు దీనిని ప్రతిష్ఠాత్మకంగా పరిగణించారు. ఈ కేసును సీఐ ఉలసయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2019 మార్చి 15న పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంగన్న ఈ హత్య కేసులో కీలకంగా మారారు. సీబీఐ విచారణలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో రంగన్న పేరు ప్రముఖంగా ప్రస్తావించారు.

కేసు దర్యాప్తు ప్రస్తుతం వేగంగా సాగుతుండగా రంగన్న అనారోగ్యంతో మరణించడం.. ఆయన మృతిపై భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News