వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. వారిపై కేసు నమోదు

హత్యకు గురైన వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి.. వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్.

Update: 2023-12-18 04:23 GMT

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సంచలన పరిణామం చోటు చేసుకుంది. పులివెందుల పోలీసులు తాజాగా ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులు ఎవరో తెలుసా? హత్యకు గురైన వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి.. వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్. ఈ ముగ్గురిపై పులివెందుల పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

ఇంతకూ వీరి మీద నమోదు చేసిన కేసు ఏమిటంటే.. వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ క్రిష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నేతల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలన్న ఒత్తిడి పెరిగినట్లుగా వెల్లడించారు.

ఇలా ఒత్తిడి తెచ్చే వారిలో సీబీఐ ఎస్పీ రాంసింగ్ కూడా ఉన్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె.. అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చినట్లుగా ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని కోరినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఏ క్రిష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి.. సునీత..రాజశేఖర్ రెడ్డి.. ఎస్పీ రాంసింగ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో పులివెందుల పోలీసులు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. తాజా పరిణామం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి.

Tags:    

Similar News