స్టీల్ ప్లాంట్ మీద ఇక తేల్చుడే
విశాఖకు ఉక్కు నగరం అన్న పేరు వచ్చింది అంటే విశాఖ ఉక్కు కర్మాగారం వల్లనే అన్నది అందరికీ తెలిసిందే.
విశాఖ స్టీల్ ప్లాంట్ వధ్య శిల మీద ఊగిసలాడుతోంది. ప్రైవేట్ పరం అవుతుందా లేక ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందా అన్నది గత నాలుగేళ్ళుగా కార్మిక వర్గంతో పాటు ప్రజానీకాన్ని కూడా సతమతం అయ్యేలా చేస్తోంది. విశాఖకు ఉక్కు నగరం అన్న పేరు వచ్చింది అంటే విశాఖ ఉక్కు కర్మాగారం వల్లనే అన్నది అందరికీ తెలిసిందే.
కేవలం స్టీల్ ప్లాంట్ తోనే కాకుండా అనేక అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చి విశాఖ పారిశ్రామిక కేంద్రంగా మారడం వెనక ఉక్కు కర్మాగారం ఘనత ఎంతో ఉంది. అలాంటి విశాఖ ఉక్కు విషయంలో ముంచరూ తేల్చరూ అన్నట్లుగానే ఉంది.
అయితే విశాఖ ఉక్కుని రోజు రోజుకీ బలహీనపరుస్తూ ఒక్కో విభాగాన్ని తగ్గిస్తూ ప్రైవేటీకరణకే మొగ్గు అన్నది మాత్రం చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఒక్క కలం పోటుతో తీసివేశారు.
దాంతో కార్మిక లోకం భగ్గుమంది వారు చేసిన పోరాటాల ఫలితంగా తిరిగి వారిని విధులలోకి తీసుకున్నారు కానీ ఆ భయాలు అయితే ఇంకా అలాగే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయమని ఒక డిమాండ్ ఉంది.
ప్రైవేట్ పరం చేసే కంటే మరో ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేసినా చాలు అని కార్మికులు అంటున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కీలకమైన సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు వివిధ విభాగాధిపతులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన పలు కీలకమైన అంశాల మీద చర్చించి ఉన్నారు.
ఇపుడు మరోసారి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఈ సమావేశానికి హాజరు అవుతున్నారు. అలాగే విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు, విశాఖ టీడీపీ ఎంపీ శ్రీ భరత్ కూడా ఈ మీటింగులో పాల్గొంటున్నారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో పాటు కేంద్ర ఆర్ధిక మంత్రి ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు తలరాత ఏమిటి అన్నది తేలుతుంది అని అంటున్నారు. సెయిల్ లో విలీనం చేయడమా లేక సొంతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నిధులను అందించడమా అన్నది కూడా చర్చిస్తారు అని అంటున్నారు. దాంతో మంగళవారం భేటీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి మంగళకరమైన వార్తను అందిస్తుందా అన్నది కార్మిక లోకం వేయి కళ్ళతో చూస్తోంది.