బిగ్ బ్రేకింగ్ : విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద జరుగుతున్న ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-14 11:42 GMT

ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద జరుగుతున్న ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హై కోర్టు తీర్పు నేపధ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్ ని కూడా రద్దు చేసింది. ఈ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు మీద మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అయితే తనను సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ రఘురాజు హైకోర్టుకు వెళ్ళారు.

ఇంతలో ఈ సీటు ఖాళీ జాబితాలో చూపించడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ని నవంబర్ 2న జారీ చేసింది. ఆ తరువాత హైకోర్టు తీర్పు వెలువడింది. రఘురాజు మీద మండలి చైర్మన్ విధించిన అనర్హత వేటు చెల్లదని తీర్పు రావడంతో నాటి నుంచే ఈ ఎన్నిక ఉండదని అంతా అనుకున్నారు

అయితే ఈ లోగా నామినేషన్ల స్వీకరణ పరిశీలన వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ లోగా ఈసీకి హైకోర్టు తీర్పు విషయాలు చేరడంతో గురువారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ ఉప ఎన్నిక రద్దు అయింది. ఇదిలా ఉంటే వైసీపీ ఈ ఉప ఎన్నికకు సంబంధించి తమ పార్టీ తరఫున వెలమ సామాజిక వర్గానికి చెందిన శంబంగి చిన అప్పలనాయుడుని ఎంపిక చేసింది ఆయన రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసారు. ఆయనతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి సుధారాణి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు.

ఈ నెల 28న ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. అయితే ఈసీ నిర్ణయంతో రద్దు అయింది. ఈ మొత్తం పరిణామాలతో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది. రఘురాజు టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచారని ఆయన మీద వేటు వేశారు. అయితే అది చెల్లదని కోర్టు చెప్పింది. ఇపుడు ఆయన వైసీపీలోనే ఉంటూ కూటమికి మద్దతు ఇస్తారా లేక రాజీనామా చేస్తారా అన్నది చూడాలి. అయితే ఆయన రాజీనామా చేయరనే అంటున్నారు. అలా చేస్తే వైసీపీకే బలం ఉంది కాబట్టి ఆ పార్టీకి సీటు వెళ్తుంది. సో ఆయన కూటమి వైపుగా ఉంటూనే తన సభ్యత్వాన్ని కాపాడుకుంటారని అంటున్నారు. ఆ విధంగా చూస్తే వైసీపీ సీటు పోయినట్లే అని అంటున్నారు. ఇది కూటమికి లాభించే అంశంగానూ చూస్తున్నారు.

Tags:    

Similar News