భారత్ కు అందుకే రాలేదు: పుతిన్ సంచలన వ్యాఖ్యలు!
విమానం బయట నుంచి దాడి జరగలేదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనకు ప్రిగోజిన్ హత్యపై దర్యాప్తు జరిపిన కమిటీ అధిపతి తెలిపారన్నారు
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పై కాలు దువ్విన ఆ దేశ కిరాయి సైన్యం.. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో మాస్కో–సెయింట్ పీటర్స్ బర్గ్ మధ్యలో ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. అతడి వాగ్నర్ దళం రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కొన్ని నెలల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
అయితే ప్రిగోజిన్ ను రష్యా దళాలే హతమార్చాయని అమెరికా ఆధ్వర్యంలోని పాశ్చాత్య దేశాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించలేదు. తొలిసారిగా ఆయన ఈ ఘటనపై స్పందించారు. విమాన ప్రమాదం అనంతరం ప్రిగోజిన్ సహా దానిలో ప్రయాణిస్తున్న వారి శరీరాల్లో గ్రనేడ్ శకలాలు లభించాయని వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విమానం బయట నుంచి దాడి జరగలేదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తనకు ప్రిగోజిన్ హత్యపై దర్యాప్తు జరిపిన కమిటీ అధిపతి తెలిపారన్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రిగోజిన్ సహా మిగిలిన వారి శరీరాల్లో గ్రనేడ్ శకలాలు కనిపించాయన్నారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణం సహా అన్ని రకాలుగా దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా పుతిన్ దర్యాప్తు తీరును కూడా తప్పుబట్టారు. విమాన ప్రమాదంలో మృతి చెందినవారికి మద్యం, డ్రగ్ టెస్టులు నిర్వహించలేదని అసహనం వ్యక్తం చేశారు. దాదాపు ఐదు కిలోల కొకైన్ ను గతంలో వాగ్నర్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకొన్న విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు.
ఆల్కహాల్ కోసం రక్త పరీక్ష చేయలేదని పుతిన్ తెలిపారు. గతంలో వాగ్నర్ గ్రూప్.. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ ఆఫీస్‌లో ఎఫ్‌ఎస్‌బీ తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో 10 బిలియన్ రూబుల్స్, ఐదు కిలోల కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు అని పుతిన్ వెల్లడించారు.
కాగా అణు శక్తితో దూసుకెళ్లే సరికొత్త క్రూయిజ్ క్షిపణిని తాము విజయవంతంగా పరీక్షించినట్లు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అంతేకాకుండా అణ్వస్త్ర పరీక్షల నిషేధానికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం నుంచి తాము వైదొలిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన బాంబుపేల్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత అణ్వాయుధ పరీక్షలు నిర్వహించే అంశాన్ని కొట్టిపారేయలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ బురెవెస్త్ నిక్ క్రూయిజ్ క్షిపణి రేంజి కొన్ని వేల మైళ్లు ఉంటుందని తెలిపారు.
పశ్చిమ దేశాలకు రష్యా అధినేత పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంపై దాడి చేస్తే వందలకొద్ది క్షిపణులు ఒక్క శత్రువు కూడా మిగలకుండా వేటాడతాయని హెచ్చరికలు జారీ చేశారు.
భారత్, రష్యా సంబంధాలపైన పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే భారత ప్రభుత్వం ఆ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని.. ఈ నేపథ్యంలో ఆ దేశంపై పశ్చిమ దేశాల కుట్రలు ఫలించబోవన్నారు.
పశ్చిమ దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని అంగీకరించని ప్రతి దేశాన్ని శత్రువుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ మండిపడ్డారు. భారత్ సహా అన్ని దేశాలు ప్రమాదంలోనే ఉన్నాయన్నారు. కానీ, భారత ప్రభుత్వం తమ దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా పనిచేస్తోందని ప్రశంసించారు. అది స్వతంత్ర దేశం. అందువల్ల, రష్యా నుంచి భారత్ ను దూరం చేసే ప్రయత్నాలు.. అర్థం లేని చర్యలే అని పుతిన్ పేర్కొన్నారు.
అలాగే భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంతోపాటు దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరుకాకపోవడంపైనా పుతిన్ స్పందించారు. తన వల్ల ఆ సదస్సులు 'పొలిటికల్ షో'గా మారకూడదనే తాను ఆ సమావేశాలకు గైర్హాజరైనట్లు హాట్ కామెంట్స్ చేశారు. ఈ సమావేశాల సమయంలో తన స్నేహితులకు (భారత్, దక్షిణాఫ్రికా) ఎందుకు సమస్యలను సృష్టించాలని అని పుతిన్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీపై పుతిన్ మరోసారి అభినందనల జల్లు కురిపించారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. రష్యా మాదిరిగానే భారతీయులు కూడా ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తున్నారని అభినందించారు.